నవనిర్మిత రామ మందిరంలో బాల రాముడి తొలి చిత్రం!

సుమారు 500 ఏళ్ల నాటి కల నేడు సాకారం అయ్యింది. అయోధ్యాపురిలో శ్రీరాముడు కొలువైన క్షణాలు ఆవిష్కృతమయ్యాయి.

Update: 2024-01-22 08:20 GMT

సుమారు 500 ఏళ్ల నాటి కల నేడు సాకారం అయ్యింది. అయోధ్యాపురిలో శ్రీరాముడు కొలువైన క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. నవనిర్మిత రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమాన్ని వేల మంది ప్రత్యక్షంగా.. కోట్ల మంది పరోక్షంగా వీక్షించారని తెలుస్తుంది.


ఇందులో భాగంగా సోమవారం 22-01-24 మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణప్రతిష్ఠ క్రతువు మొదలైంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ... ముందుగా స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. తర్వాత... సరిగ్గా 12 గంటల్ల 29 నిమిషాలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది.

అనంతరం స్వామివారికి ప్రధాని మొదటి హారతి సమర్పించారు. ఈ బాలరాముడు... ఎడమచేతిలో విల్లు, కుడిచేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి దర్శనమిచ్చారు. ఈ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో హెలికాప్టర్లతో ఆలయంపై పూలవర్షం కురిపించారు. ఈ క్రతువుల్లో ఆర్.ఎస్.ఎస్. చీఫ్‌ మోహన్‌ భాగవత్‌, ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రాణప్రతిష్ట అనంతరం చిరు దరహాసం, ప్రసన్న వదనంతో దర్శనమిచ్చిన బాలరాముడి తొలి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోట్ల మంది సెల్ ఫోన్ లలో ఈ ఫోటో వాల్ పేపర్ గా.. మరికొంత మంది వాట్సప్ స్టేటస్ గా మారిపోతుంది. ఇదే సమయంలో అంతకంటే ముఖ్యంగా కోట్ల మంది భక్తుల హృదయాల్లో శాస్వతంగా ముద్రించబడిపోతుంది!

Tags:    

Similar News