ఏపీని విమానంలో ఎక్కించేస్తున్న జూనియర్ ఎర్రం

గత రెండున్నర నెలలుగా ఆయన పౌర విమాన యాన శాఖ విషయంలో ఏపీకి శుభవార్తలే చెబుతున్నారు.

Update: 2024-08-27 17:03 GMT

ఏపీకి కేంద్రంలో మంచి శాఖ లభించింది అని అంతా సంతోషించారు. దానికి యువకుడు అయిన రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చూస్తున్నారు. దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు అయిన రామ్మోహన్ తన పనితీరులో జోరు చూపిస్తున్నారు. గత రెండున్నర నెలలుగా ఆయన పౌర విమాన యాన శాఖ విషయంలో ఏపీకి శుభవార్తలే చెబుతున్నారు. ఒక విధంగా ఏపీని ఆయన విమానమే ఎక్కించేస్తున్నారు.

చాలా దూరదృష్టితోనే రామ్మోహన్ ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. రానున్న అయిదు పదేళ్లలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో డొమెస్టిక్ ఏరోప్లేన్ ల అవసరం పడుతుంది. గతంలో కూడా డెస్టినేషన్ ఫ్లైట్స్ అంటూ ఒక చర్చ సాగింది. టైర్ టూ సిటీలలో వాటిని ఏర్పాటు చేయడం ద్వారా మధ్యతరగతి ప్రజలను కూడా విమానం ఎక్కించి వారి జీవిత కాలం కోరిక తీర్చాలని ప్రభుత్వాలు ఆలోచించాలి.

ఇపుడు అది కార్యరూపం దాల్చేలా కనిపిస్తోంది అని అంటున్నరు. ఏకంగా ఏపీకి ఏడు కొత్త ఎయిర్ పోర్టులు రాబోతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ ప్రకటించారు. అలా ఏపీలో 7 కొత్త ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుకు సర్వే చురుగ్గా సాగుతోందని ఆయన తెలిపారు. శ్రీకాకుళం,అన్నవరం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్ కుప్పం, ఒంగోలు-నెల్లూరు, అనంతపురంలో కొత్త ఎయిర్ పోర్ట్ ల ఏర్పాటుకు పరిశీలన జరుగుతోందని ఆయన వివరించారు.

అంతే కాదు ఏపీలో త్వరలో సీ ప్లేన్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని మరో శుభవార్తను చెప్పారు. అలా మొట్టమొదటి సీ ప్లేన్ డెమో సైతం ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు నిర్వహిస్తామని అన్నారు. ఇక ఏపీలో విమానాశ్రయాల సామర్థ్యం పెంచుతున్నామని కూడా కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు.

ఇది ఒక విధంగా మంచి పరిణామమే అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వాసులకు ఎయిర్ పోర్టు కల తీరడం అంటే గ్రేటే అనుకోవాలి. అలాగే టీర్ టూ సిటీస్ నుంచి ఎయిర్ కనెక్టివిటీ పెరిగితే రూరల్ ఎకానమీ కూడా బాగా పెరుగుతుందని అంటున్నారు. ఒక చోట నుంచి పండిన పంటను మరో చోటకు కూడా కార్గో ఎయిర్ ప్లేన్ ల ద్వారా తీసుకుని వెళ్లవచ్చు.

అంతే కాదు మార్కెటింగ్ స్పేస్ బాగా పెరుగుతుంది. ఇక టూరిజం కి ఇది ఊతం ఇస్తుంది అని అంటున్నారు. దూరం తగ్గి టైం మిగిలితే అదే ఎకానమీని పెంచే సరికొత్త సాధనం అవుతుంది అని అంటున్నారు. గతంలో కూడా అనేక ప్రతిపాదనలు వచ్చినా ఏపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయకత్వంలో అది సాకారం అవుతుందని అంతా ఆశిస్తున్నారు.

Tags:    

Similar News