టీడీపీ ఎంపీ హ్యాట్రిక్ ఆశలకు తిరక్రాసు ?

ఉత్తరాంధ్రాలో శ్రీకాకుళం ఎంపీ సీటు టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి అత్యధికసార్లు గెలిచిన సీటు అది

Update: 2024-05-19 04:08 GMT

ఉత్తరాంధ్రాలో శ్రీకాకుళం ఎంపీ సీటు టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి అత్యధికసార్లు గెలిచిన సీటు అది. ఇక టీడీపీ మొత్తం రాజకీయ చరిత్రలో శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి ఒక్క కింజరాపు కుటుంబమే దాదాపుగా పాతికేళ్ల పాటు గెలిచింది పాలించింది. మొదట దివంగత నేత ఎర్రన్నాయుడు ఎంపీగా దాదాపుగా దశాబ్దన్నర పాటు పనిచేయగా ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు రెండు దఫాలుగా పదేళ్ల పాటు పనిచేశారు.

ఆయన 2014లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి గెలిచి 2019లో మరోసారి గెలిచారు. 2024లో గెలిస్తే హ్యాట్రిక్ ఎంపీ అవుతారు. అయితే ఈసారి ఆయనకు కొన్ని రాజకీయ సమీకరణలు ఇబ్బందిగా మారాయని అంటున్నారు. పాతపట్నం, శ్రీకాకుళం అసెంబ్లీ సీట్లకు పాత కాపులకు కాకుండా కొత్త ముఖాలకు టీడీపీ ఇచ్చింది. దీని వెనక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఉన్నారు.

దాంతో రెబెల్స్ కోపం వ్యక్తం చేశారు. నిరసనలూ చేశారు. అయితే పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణను బుజ్జగించి జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. దాంతో ఆయన కొంత శాంతించినా పాతపట్నం ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్ధికి పనిచేయలేదు అన్న విమర్శలు ఉన్నాయి. పోలింగ్ సరళి చూస్తే వైసీపీ అభ్యర్ధి రెడ్డి శాంతికి టీడీపీ ఓట్లు క్రాస్ అయ్యాయని అంటున్నారు. మరి ఎంపీ ఓట్లు ఎటు టర్న్ అయ్యాయన్నది ఇక్కడ ప్రశ్న.

ఎంపీ వరకూ రామ్మోహన్ కే ఓట్లు వేయాలని నిర్ణయించినా కలమట వర్గం మాత్రం అసహనంతో ఉందని దాంతో వారు క్రాస్ చేసి ఉంటారు అని అంటున్నారు. దాంతో పాతపట్నం ఓట్లు ఎంపీకి ఎన్ని పడతాయన్నది ఒక చర్చగా ఉందిట. ఇక శ్రీకాకుళంలో చూస్తే మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబానికి ఈసారి టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారు అన్న బాధతో ఆయన అనుచర వర్గం కసిగా వైసీపీకి పనిచేసింది అని అంటున్నారు. పోలింగ్ సరళి చూస్తే వైసీపీ అభ్యర్ధి ధర్మాన ప్రసాదరావుకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగింది అని అంటున్నారు.

అదే విధంగా ఎంపీ అభ్యర్ధి రామ్మోహన్ ని కాకుండా కూడా వైసీపీ అభ్యర్థి పేడాడ తిలక్ కి క్రాస్ చేశారు అని కూడా అంటున్నారు. దాంతో రెండు కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎన్ని ఓట్లు టీడీపీ ఎంపీకి పడతాయన్నది చర్చగా మారింది. అయితే వైసీపీ నుంచి టీడీపీ ఎంపీకి అంతే లెవెల్ లో క్రాస్ జరిగింది అని అంటున్నారు. ఎప్పటి మాదిరిగానే ధర్మాన కింజరాపు కుటుంబాల మధ్య ఉన్న లోపాయికారీ అవగాహనతో శ్రీకాకుళం నరసన్నపేటల నుంచి టీడీపీ ఎంపీకి క్రాస్ ఓటింగ్ జరిగిందని అలాగే మరికొన్ని చోట్ల కూడా రామ్మోహన్ కి అనుకూలంగా వైసీపీ నుంచి భారీగానే క్రాస్ ఓటింగ్ జరిగింది అని అంటున్నారు.

దీంతో సొంత పార్టీ ఓట్లు అవతలకు పడి ప్రత్యర్ధి పార్టీల ఓట్లు ఇవతలకు వచ్చిన క్రమంలో ఎవరు విజేత అవుతారు అన్నది పెద్ద ప్రశ్నగా ఉందిట. హ్యాట్రిక్ ఎంపీగా గెలిచి నిలవాలని రామ్మోహన్ చూస్తున్నారు. అయితే ఈసారి కాళింగ సామాజిక వర్గానికి చెందిన పేడాడ తిలక్ ని ఎంపీగా చేయాలని జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో ఉన్న ఆ సామాజిక వర్గం పార్టీలకు అతీతంగా పనిచేసింది అని అంటున్నారు. దాంతో సిక్కోలు ఫలితం ఎలా ఉండబోతోంది అన్నది జూన్ 4న తేలాల్సి ఉంది.

Tags:    

Similar News