మొదటిసారి రామోజీరావు కొత్త గెటప్ లో..?

ఈసారి ఆయన లుక్ రోటీన్ కు భిన్నంగా ఉండటమే కాదు.. దశాబ్దాల తరబడి తెలిసిన రామోజీకి పూర్తి భిన్నంగా ఉండటం ఆసక్తికరంగా మారింది.

Update: 2023-10-07 05:08 GMT

విమర్శల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఆరోపణల్ని వదిలేద్దాం. ఎవరు అవునన్నా.. కాదన్నా రెండు తెలుగు రాష్ట్రాల్ని ప్రభావితం చేయగలిగిన అతి కొద్దిమంది ప్రముఖుల్లో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఉంటారని చెప్పక తప్పదు. రామోజీరావు అన్నంతనే.. క్లీన్ షేవ్.. వైట్ అండ్ వైట్ మనిషి గుర్తుకు వస్తారు. మిగిలిన ఎంతోమంది ప్రముఖులకు భిన్నంగా వైట్ షూస్ వేసుకొనే ఆయన వ్యవహారమే వేరుగా చెబుతారు.


అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే ఆయన బయటకు వస్తారు. తాజాగా ఆయన మరోసారి బయటకు వచ్చారు. ఈసారి ఆయన లుక్ రోటీన్ కు భిన్నంగా ఉండటమే కాదు.. దశాబ్దాల తరబడి తెలిసిన రామోజీకి పూర్తి భిన్నంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. క్లీన్ షేవ్ తో ఉండే రామోజీ.. ఇప్పుడు మాత్రం గడ్డంతో దర్శనమిచ్చారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో రామోజీ ఫిలిం సిటీలో భేటీ అయ్యారు.


ఎదుటి వ్యక్తుల స్థాయి ఎంతైనా.. తన వద్దకు వచ్చిన వేళ.. తన స్థాయిని ప్రదర్శించే అలవాటున్న రామోజీ.. నడ్డా భేటీ విషయంలోనూ అదే విషయాన్ని మరోసారి ప్రదర్శించారు. రామోజీ ఫిలిం సిటీలో నడ్డాతో భేటీ అయిన వేళ.. ఆయన కూర్చున్న కుర్చీ సింహాసనాన్ని తలపించేలా ఉండటం గమనార్హం. అదే సమయంలో తన ఎదురుగా కూర్చున్న నడ్డా కుర్చీ.. రామోజీ కూర్చున్న కుర్చీ ముందు వెలవెలబోవటం చూస్తే.. రామోజీ దర్పమా? మజాకానా? అనుకోకుండా ఉండలేం.


నడ్డాతో పాటు కేంద్రమంత్రిప్రకాశ్ జవదేకర్ కూడా ఉన్నారు. సమకాలీన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా.. అప్పుడప్పుడు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో బీజేపీ అగ్రనేతలు భేటీ కావటం తెలిసిందే. మార్గదర్శి ఎపిసోడ్ లో ఏపీ సీఐడీ దెబ్బకు విలవిలలాడుతున్న రామోజీ అండ్ కోకు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం ఎందుకు అందటం లేదన్న మాట బలంగా వినిపించింది. మార్గదర్శి ఎపిసోడ్ లో తనను ఏపీ ప్రభుత్వం వేధిస్తుందన్న మాటను తరచూ చెబుతున్న ఈనాడు.. తనకున్న పలుకుబడిని ఎందుకు ప్రదర్శించలేకపోతున్నట్లు? అన్నది అర్థం కానిదిగా మారింది.

ఇలాంటి సందర్భంలోనే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రామోజీ ఫిలిం సిటీకి స్వయంగా వచ్చి.. రామోజీరావుతో భేటీ కావటం.. ఆ సందర్భంగా తన దర్పాన్ని ఇసుమంత కూడా తగ్గని వైనం ఒక ఎత్తు అయితే.. బయటకు వచ్చిన ఫోటోల్లో రామోజీ - నడ్డా భేటీ అయిన గది ఇంటీరియర్ చూస్తే.. రామోజీ ఎంతటి విలాసవంతమైన భవనంలో ఉంటారన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News