రాముడ్ని బీజేపీ వాడుతోందా? మీరూ వాడేయండి వద్దన్నది ఎవరు?

రాముడ్ని ఒక పార్టీకే సొంతమైనట్లుగా బిల్డప్ ఇస్తున్నారంటూ బీజేపీ మీద పడి ఏడ్చే ముందు చేయాల్సిన పని ఇతర పార్టీలకు ఉంది.

Update: 2024-04-26 05:07 GMT

రాముడి పేరుతో బీజేపీ నాటకాలు ఆడుతుందని.. భగవంతుడ్ని ఇలా వాడేయటం ఆ పార్టీకే చెల్లిందంటూ విరుచుకుపడుతున్న సెక్యులర్ పార్టీల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ వ్యాఖ్యల్ని విన్న ప్రతిసారీ కలిగే సందేహం ఒక్కటే. బీజేపీ రాముడ్నివాడేస్తే.. మీరెందుకు కామ్ గా ఉండాలి. సదరు సెక్యులర్ పార్టీల సూత్రీకరణ ప్రకారం రాముడు అందరివాడు అయినప్పుడు.. ఆయన్ను వాడొద్దని రాముడేం కండీషన్ పెట్టలేదు కదా? అలాంటప్పుడు రాముడు తమవాడు కూడా అన్న మాటను సెక్యులర్ పార్టీల పేరుతో ప్రవచనాలు పలికే వారంతా చెబితే ఎవరు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తారు చెప్పండి?

రాముడ్ని ఒక పార్టీకే సొంతమైనట్లుగా బిల్డప్ ఇస్తున్నారంటూ బీజేపీ మీద పడి ఏడ్చే ముందు చేయాల్సిన పని ఇతర పార్టీలకు ఉంది. రాముడు బీజేపీకే ఎందుకు? మాకు మాత్రం సొంతం కాదెందుకు? అంటూ ప్రశ్నించొచ్చు కదా? దేవుడు అందరివాడు కదా? మరి.. బీజేపీకే ఎందుకు సొంతమైనట్లుగా ఎందుకు కనిపిస్తోందంటే.. అది సెక్యులర్ పార్టీల పేరుతో ప్రచారం చేసుకునే పార్టీల చేతకానితనంతోనే. తమ మాటలకు చేతలకు సంబంధం లేకుండా వ్యవహరిస్తున్న వేళ.. రాముడ్ని అంటరానివాడిగా చూపిస్తూ.. ఆ పేరుతో ఉన్న సమస్యను దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం చేస్తూ.. స్టేటస్ కో మాటతో సర్ది చెబుతూ తప్పుల మీద తప్పులు చేసిన పార్టీలకు.. రాముడి పేటెంట్ తమకే సొంతమన్నట్లుగా బీజేపీ ప్రయత్నించి ఫలితాన్ని సొంతం చేసుకుంటోంది.

రాముడి మాటకు ఓటు పడదన్న ధీమాతో ఉన్న రాజకీయ పార్టీలకు.. ఇప్పుడా మాట ఒక ప్రభంజనంగా మారిన వేళ.. రాముడి మాటకు ఇంత పవర్ ఉందన్న విషయాన్ని అర్థం చేసుకున్న రాజకీయ పార్టీలు.. ఇప్పటివరకు తాము చెప్పిన మాటల్ని వెనక్కి తీసుకోలేక.. అదే సమయంలో ముందుకు వెళ్లలేక కిందా మీదా పడుతూ.. రాముడి పేరు మీద సరికొత్త సిద్ధాంతాన్ని సూత్రీకరించేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో మరిన్ని తప్పులు చేస్తూ.. బీజేపీకి రాముడ్ని కట్టబెడుతున్నారు.

నిజానికి రాముడ్నిబీజేపీ వాడేసిందన్న దాని కంటే కూడా.. మిగిలిన పార్టీలు రాముడ్ని ఒక అంటరానివాడిగా.. ఆ పేరును పఠిస్తే.. తమకొచ్చే మైనార్టీ ఓట్లు మిస్ అవుతాయన్న ముందుచూపుతో వేసిన ఎత్తుగడలు.. ఎదురుదెబ్బలుగా మారుతున్న వేళ.. రాముడి మాటకున్న శక్తిసామర్థ్యాలు అర్థమైన పరిస్థితి. దీంతో.. రాముడి పేరును ప్రస్తావించకుండా ఉండేందుకు సరికొత్త సూత్రీకరణల్ని షురూ చేశారు.

మొత్తంగా చూస్తే.. రాముడి విషయంలో రాజకీయ పార్టీలు నిజాయితీగా వ్యవహరించలేదని చెప్పాలి. గతంలో చేసిన తప్పుల్ని వర్తమానంలో కంటిన్యూ చేస్తూ.. చెత్తవాదనల్నివినిపించటం ద్వారా ప్రజల్లో రాముడ్ని బీజేపీకి కట్టబెట్టేస్తున్న దుస్థితి. ఇప్పటికైనా రాముడి విషయాన్ని రాజకీయం చేయకుండా.. తమ ఉద్దేశాల్ని రాజకీయ పార్టీలు సూటిగా చెప్పే ప్రయత్నం చేయాలి. అదే సమయంలో రాముడ్ని బీజేపీకి కట్టబెట్టే తీరును తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్పించి.. రాముడ్ని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని పార్టీలు ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిది. లేదంటే.. తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News