చెల్లెమ్మ పార్లమెంటులో సిటింగ్, మాజీ ఎంపీల కొట్లాట

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒకప్పటి అసెంబ్లీ నియోజకవర్గమైన చేవెళ్ల.. 2009లో పార్లమెంటు స్థానంగానూ ఏర్పడింది.

Update: 2024-01-23 11:04 GMT

ఉమ్మడి ఏపీవ్యాప్తంగా 25 ఏళ్ల కిందటనే ఈ నియోజకవర్గం పేరు మార్మోగింది. పలు ప్రభుత్వ కార్యక్రమాలు, చరిత్రను మలుపుతిప్పిన సంఘటనలు అక్కడినుంచే మొదలవడంతో ఆ నియోజకవర్గం ఓ సెంటిమెంటుగా మారిపోయింది. అక్కడి నాయకురాలిని చేవెళ్ల చెల్లెమ్మగా పేర్కొనేవారు. కాలక్రమంలో ఆ నియోజకవర్గం రిజర్వుడ్ గా మారింది. అప్పటివరకు అసెంబ్లీ స్థానం స్థాయిలో మాత్రమే ఉండగా.. తర్వాత పార్లమెంటు సీటుగానూ ఏర్పడింది. దీంతో చెల్లెమ్మె నియోజకవర్గం ప్రాధాన్యం బాగా పెరిగింది. ఇక అక్కడినుంచి డబ్బున్న పారిశ్రామికవేత్తలు పోటీ చేస్తుండడంతో మరింత ప్రతిష్ఠాత్మకంగా మారింది.

వైరం తీవ్రమైంది..

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒకప్పటి అసెంబ్లీ నియోజకవర్గమైన చేవెళ్ల.. 2009లో పార్లమెంటు స్థానంగానూ ఏర్పడింది. 2009లో ప్రముఖ రాజకీయ నాయకుడు జైపాల్ రెడ్డి ఇక్కడినుంచి గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. 2014లో బీఆర్ఎస్ తరఫున ప్రముఖ పారిశ్రామికవేత్త కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలిచారు. అయితే, పార్టీని విభేదించి బయటకు వచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచారు డాక్టర్ రంజిత్ రెడ్డి. అంటే వరుసగా రెండు సార్లు చేవెళ్ల ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ దే విజయం అన్నమాట. కాగా.. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి ఎంపీగా గెలిచినా ఓట్ల తేడా పెద్దగా ఉండదు. క్రితం సారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన విశ్వేశ్వర రెడ్డి కేవల 14 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతకుముందు బీఆర్ఎస్ నుంచి ఆయన గెలిచింది 73 వేల ఓట్ల ఆధిక్యంతోనే. ఇప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగడం ఖాయం. బీఆర్ఎస్ నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డికీ టికెట్ ఖరారైంది. అయితే, ఆర్థికంగా బలవంతులైన వీరి మధ్య ఇప్పుడు విభదాలు భగ్గుమంటున్నాయి.

పోలీసు కేసుకెక్కిన రచ్చ...

ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన, ఉన్నత చదువులు చదివిన ఎంపీ రంజిత్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి మధ్య విభేదాలు ఇప్పుడు పోలీసు కేసు వరకు వెళ్లాయి.

ఒకరిపై మరొకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగతంగా విభేదాలతో వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకున్నారు. తన అనుచరులను విశ్వేశ్వర్ రెడ్డి ఎందుకు కలిశారని ఫోన్‌లో రంజిత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశ్వేశ్వర్‌ రెడ్డి కూడా ప్రత్యర్థిపై అంతే స్థాయిలో విరుచుకుపడ్డారు. రంజిత్‌ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే తన వాళ్లను తీసుకువెళ్లాలని సవాల్ చేశారు. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదే విషయంలో రంజిత్‌ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండు రోజుల కిందట ఫిర్యాదు చేయడం గమనార్హం.


Tags:    

Similar News