సీఎం పోస్ట్ పై రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు... కర్ణాటక ఉదాహరణ!

తెలంగాణలో అధికార బీఆరెస్స్ ను గద్దె దించడమే లక్ష్యంగా పలువురు కాంగ్రెస్ నేతలు అలుపెరగని పోరాటం చేస్తుంటే

Update: 2023-11-21 04:45 GMT

తెలంగాణ ఎన్నికల్లో ప్రచారాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. పోలింగ్ కు సమయం దగ్గరపడుతుంది. ఈ సమయలో పాత అలవాటులో భాగమో.. లేక, కర్ణాటక ఎన్నికల ఫలితాలిచ్చిన ఉత్సాహ ఫలితమో తెలియదు కానీ... తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం పోస్ట్ పై విపరీతమైన చర్చ అయితే జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా తానకు కూడా సీఎం అవ్వాలని ఉందంటూ మొదలుపెట్టారు రేణుకా చౌదరి!

అవును... తెలంగాణలో అధికార బీఆరెస్స్ ను గద్దె దించడమే లక్ష్యంగా పలువురు కాంగ్రెస్ నేతలు అలుపెరగని పోరాటం చేస్తుంటే.. మరికొంత మంది మాత్రం సీఎం పోస్టులు, మంత్రిపదవులపై అనవసరపు చర్చ తెరపైకి తెస్తున్నారనే కామెంట్లు గతకొన్ని రోజులుగా వినిపిస్తున్న తరుణంలో తాజాగా సీఎం పోస్ట్ పై రేణుకా చౌదరి స్పందించారు. ఇందులో భాగంగా... "సీఎం కావాల‌ని నాకూ ఉంది. అయితే.. ఇదంతా అవుతుందా?" అని అన్నారు.

ఈ సందర్భంగా... తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని, ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు తమవేనని రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేసారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి పదవిని చాలామంది ఆశిస్తారని, గెలిచివచ్చిన ప్రతి ఒక్కరికీ ఆ పదవి అడిగే హక్కు కూడా వుంటుందని అన్నారు. అయితే... రాష్ట్రాన్ని సమర్దవంతంగా పాలిస్తారన్న నమ్మకం ఎవరిపై అధిష్టానానికి వుంటుందో వారే సీఎం అవుతారన్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసేంత స్థాయిలో కాంగ్రెస్‌ కు సీట్లు వ‌స్తాయ‌ని.. రాష్ట్రంలో ఎంతపెద్ద నాయకులైనప్పటికీ అధిష్టానాన్ని మెప్పిస్తేసే ముఖ్యమంత్రి అవుతారని రేణుకా చౌదరి స్పష్టం చేసారు. ఈ సందర్భంగా ఇటీవల క‌ర్ణాట‌కలో జ‌రిగిన ఉదంతాన్ని ఆమె ప్రస్తావించారు. ఇందులో భాగంగా... కర్ణాటకలో సీఎం సీటు కోసం ఎంత పోరు జ‌రిగిందో చూశారు క‌దా.. అంటూ ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం!

అక్కడ... ముందుగా అంతా డీకే శివ‌కుమార్ ను సీఎంగా అనుకున్నార‌ని, చివ‌ర‌కు పార్టీ అధిష్టానం.. సిద్దరామ‌య్యను ఎంపిక చేసిందని చెప్పుకొచ్చిన రేణుకా చౌదరి... అదేవిధంగా తెలంగాణలోనూ ఎంతో మంది అనుకుంటారని.. చివ‌ర‌కు అధిష్టానం నిర్ణ‌య‌మే అంద‌రికీ ఆమోద‌యోగ్యం అవుతుంద‌ని తేల్చి చెప్పారు. ఈక్రమంలోనే త‌న‌కు కూడా సీఎం కావాల‌నే ఉంద‌ని అన‌డం మనసులోమాట బయటపెట్టారు!

ఈ సందర్భంగా అధికార బీఆరెస్స్ పై విమర్శలు గుప్పించిన రేణుకా చౌదరి... బీఆరెస్స్ కొత్త సినిమాను ప్రజలు నమ్మరని.. ఈ ఎన్నికలలో ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెబుతారని అన్నారు. కడుతుండంగానే డబుల్ బెడ్ రూం ఇళ్ళు కూలిపోతున్నాయని చెప్పుకొచ్చారు. ఎంఐఎంకి మైనారిటీలు దూరం అయ్యారని.. మహ్మద్ అజారుద్దీన్ ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ ఐటిలో కింగ్ అంటారు.. ఉద్యోగాలు మాత్రం ఇవ్వరు అని ఎద్దేవా చేశారు!

Tags:    

Similar News