ఓటమికి జగనే కారణం.. వైసీపీలో రాపాక కాక?
అది 2019 సార్వత్రిక ఎన్నికల సమయం. ఆ ఎన్నికల్లో ఒంటరిగా సత్తా చాటాలని పోటీ చేసిన జనసేన కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది.
అది 2019 సార్వత్రిక ఎన్నికల సమయం. ఆ ఎన్నికల్లో ఒంటరిగా సత్తా చాటాలని పోటీ చేసిన జనసేన కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. అది డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం. అక్కడ జనసేన పార్టీ నుంచి రాపాక వరప్రసాద్ గెలుపొందారు. దీంతో... రాజోలుని జనసేన కంచుకోటగా అభివర్ణించారు జనసైనికులు.
అయితే... కారణం ఎవరనే సంగతి కాసేపు పక్కనపెడితే... రాపాక వరప్రసాద్, గాజు గ్లాసుకు దూరం జరుగుతూ ఫ్యాన్ కిందకు చేరిపోయారు. దీనిపై జనసైనికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.. తమదైన శైలిలో నిరసన తెలిపారు. దీంతో... ఈ గెలుపు పార్టీది కాదని, తనపై నమ్మకంతోనే ప్రజలు గెలిపించారని పలికారు రాపాక.
దీంతో... రాజోలు నియోజకవర్గంలో జనసైనికులకు బద్ధ శత్రువు అయిపోయారు రాపాక వరప్రసాద్. అనంతరం పూర్తిగా వైసీపీ మనిషిగా మారిపోయారు. అయితే... రాపాక వరప్రసాద్ వ్యవహారశైలి వైసీపీలో సమస్యగా మారిందని.. అది నచ్చకపోవడంతో వైసీపీ రాజోలులో రెండుగా చీలిపోయిందనే కామెంట్లు వినిపించాయి.
ఈ సమయంలో మాజీ మంత్రి, సీనియర్ నేత గొల్లపల్లి వైసీపీలో చేరడం, ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తూ.. రాపాకను అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని జగన్ కోరడం.. ఆ ఎన్నికల్లో రాపాక ఓటమి పాలవ్వడం తెలిసిందే. ఇదే సమయంలో ఎమ్మెల్యేగా గొల్లపల్లి ఓటమికి కూడా తెరవెనుక రాపాక చేసిన రాజకీయ కూడా ఒక కారణం అని స్థానిక నేతలు చెబుతుంటారు.
ఇప్పుడు మరోసారి రాపాక పార్టీ మారో ఆలోచన చేయడం మొదలుపెట్టారని తెలుస్తోంది. అయితే... ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. జనసేనలో వెళ్లడానికి అటు పవన్ కానీ, ఇటు జన సైనికులు కానీ అంగీకరించరని అంటున్నారు. ఇదే సమయంలో పవన్ తో మైత్రిలో ఉండగా సైకిల్ ఎక్కించుకునే అవకాశం కూడా తక్కువని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీలోకి వెళ్లే అవకాశాలున్నాని చెబుతున్నారు. మరోపక్క జనసేన తరుపున జరుగుతున్న మీటింగులకు రాపాక హాజరువుతున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాజాగా జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు రాపాక. ఈ సందర్భంగా... 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పొందడానికి జగనె కారణం అని నొక్కి చెప్పారు.
అవును... వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఆయన చుట్టూ ఉన్న కోటరీ కారణం కాదని.. స్వయంగా జగన్ మోహన్ రెడ్డే కారణమని రాపాక కామెంట్ చేశారు. ఈ సందర్భంగా జగన్ ఎవరి మాటా వినరని ఆరోపించారు.
సాధారణంగా జగన్ ని ఆరు నెలలకు ఒకసారి మాత్రమే కలిసే అవకాశం వస్తుందని.. కొంతమందికి ఆ అవకాశం కూడా రాదని చెప్పుకొచ్చారు. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అయినప్పటినుంచీ జగన్ కు వ్యతిరేకంగా రాపాక కామెంట్స్ చేస్తూనే వస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంలపై వైసీపీ సందేహాలు వ్యక్తపరిచింది.
అప్పుడు కూడా స్పందించిన రాపాక... 2019 ఎన్నికల్లో విడి విడిగా పోటీ చేసినపుడు టీడీపీ, బీజేపీ, జనసేనలకు వచ్చిన ఓట్లు లెక్క చూడాలని.. 2024లో ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నప్పుడు కచ్చితంగా వైసీపీ ఓడిపోద్దని తనకు తెలుసని చెప్పుకొచ్చారు. ఈవీఎంల వల్ల ఓడిపోయానడంలో వాస్తవం లేదని అన్నారు!
ఏది ఏమైనా... ఇప్పటికే జనసేన, వైసీపీ పార్టీలలో పనిచేసిన రాపాక వరప్రసాద్... నెక్స్ట్ సైకిల్ ఎక్కే అవకాశాలు ఉన్నాయా.. లేక, కమలం అందుకునే ఛాన్స్ ఉందా అనేది వేచి చూడాలి!