అటు తిప్పి ఇటు తిప్పి అసలు విషయం చెప్పిన రాపాక!

ఇప్పటికే.. కోనేటి ఆదిమూలం, గుమ్మనూరు జయారాం వంటివారు ఆ ఆఫర్ ను తిరస్కరించిన నేపథ్యంలో తాజాగా రాపాక వరప్రసాద్ స్పందించారు

Update: 2024-03-12 13:34 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు నియోజకవర్గాల్లో జగన్ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పులు అంశం ఇప్పటికే పలు నియోజకవర్గల్లో సమస్యలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పైగా ఎంపీగా పోటీ చేయమని కోరితే.. ఎందుకో కానీ వైసీపీ నేతలు దూరం జరిగిపోతున్నారు. ఇప్పటికే.. కోనేటి ఆదిమూలం, గుమ్మనూరు జయారాం వంటివారు ఆ ఆఫర్ ను తిరస్కరించిన నేపథ్యంలో తాజాగా రాపాక వరప్రసాద్ స్పందించారు!

అవును... ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావుని రాజోలు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను అమలాపురం లోక్ సభ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ప్రకటించారు. ఈ సమయంలో రాజోలు నియోజకవర్గంలో గొల్లపల్లి సూర్యారావు గెలిచే సూచనలు లేవని.. మరోసారి సర్వే చేయించమని జగన్ కు సూచించారు రాపాక!

వైసీపీ ఆవిర్భావం సందర్భంగా మల్కిపురంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో కేకు కట్ చేసి కార్యకర్తలతో పంచుకున్నారు రాపాక. ఈ సందర్భంగా మైకందుకున్న ఆయన... రాజోలు గతంలో వైసీపీ రెండుసార్లు గెలవలేదని గుర్తు చేశారు. ఇక మూడోసారీ అవకాశం వచ్చింది.. ఈసారైనా గెలవడానికి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన చేయాలని సూచిస్తూ.. ఇక్కడ కష్టపడిన కార్యకర్తలు, నాయకులు ఉన్నారని తెలిపారు.

ఈ సందర్భంగా... రాజోలు నియోజకవర్గంలో గడప గడపతో పాటు ప్రభుత్వం ఆదేశించిన అన్ని కార్యక్రమాలూ చేసినట్లు తెలిపారు. ఇక ఏది ఏమైనా రాజోలు గెలవాలి.. జగన్ సీఎం అవ్వాలి అని చెప్పిన ఆయన... మీ సర్వేలన్నీ చేయించుకుని ఎవరైతే గెలుస్తారో వారికే సీటు ఇవ్వాలని సూచించారు. ఇదే సమయంలో ఎవరికి ఇచ్చినా రాజోలులో వైసీపీ గెలవాలని ఆకాంక్షించారు.

అనంతరం... తనకే టిక్కెట్ ఇవ్వాలని తాను చెప్పనని, కానీ.. ఎవరినో తెచ్చి ఇక్కడ పెడితే కాస్త ఇబ్బంది అవుతాదని.. ఆయన గెలిచినా తనకు అభ్యంతరం లేదని.. అయితే గెలిచే సూచనలు కనిపించడం లేదని.. అలా గెలిచే అవకాశంలేనివారికి టిక్కెట్ ఇచ్చి వేరే పార్టీ ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి తేవొద్దని చెప్పుకొచ్చారు!

దీంతో... తన మనసులో మాటను కాస్త అటు తిప్పి ఇటు తిప్పి అన్నట్లుగా బయటపెట్టే ప్రయత్నం రాపాక చేశారని.. గొల్లపల్లికి కాకుండా తనకే ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని పరోక్షంగా స్పష్టం చేశారని అంటున్నారు పరిశీలకులు! మరోపక్క గొల్లపల్లి వైసీపీలో జాయిన్ అవ్వడంతో రాజోలులో ఆ పార్టీకి అదనపు బలం చేకూరిందని.. వైసీపీ క్యాడర్ కి, అభిమానులకి తోడు గొల్లపల్లి ఛరిష్మా కూడా తొడయితే గెలుపు సులువనే చర్చ నియోజకవర్గంలో జరుగుతుందని తెలుస్తుంది.

Tags:    

Similar News