పోలింగ్ రోజు ర్యాపిడో బంపరాఫర్... వారందరికీ ఫ్రీ రైడ్!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. గతకొన్ని రోజులుగా హోరెత్తించేస్తున్న ప్రచారాలకు ఈ రోజుతో చివరి తేదీ! దీంతో రేపటి నుంచి మైకులు మూగబోనున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. గతకొన్ని రోజులుగా హోరెత్తించేస్తున్న ప్రచారాలకు ఈ రోజుతో చివరి తేదీ! దీంతో రేపటి నుంచి మైకులు మూగబోనున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 30న జరిగే పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఓటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయని అంటున్నారు.
ఇందులో భాగంగా పోలింగ్ సిబ్బందికి శిక్షణ, నియోజకవర్గాల కేటాయింపు పూర్తయింది. మరోపక్క ప్రధానంగా హైదరాబాద్ లో ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల కమిషన్, పలు స్వఛ్చంద సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సిటీలో ప్రజలకు అందుబాటులో ఉండేలా వీలైనన్ని ఎక్కువ పోలింగ్ బూత్స్ ఏర్పాటుచేసింది. ఇదే సమయంలో ఓటర్లలో చైతన్యం రగిల్చేలా జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది.
ఇదే సమయంలో... తమ తమ ఎన్నికల ప్రచారంతో పాటు, పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ తమ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని నేతలు సూచిస్తున్నారు. వీరితో పాటు సినీ, క్రీడా ప్రముఖులు కూడా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఓటు హక్కు కచ్చితంగా వినియోగించుకోవాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బైక్ ట్యాక్సీ కంపెనీ రాపిడో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.
అవును... హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం 2,600 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఉచితంగా తీసుకెళ్లనున్నట్లు ర్యాపిడో సంస్థ ప్రకటించింది. ఈ అవకాశాన్ని ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని సంస్థ కోరింది. హైదరాబాద్ నగరంలో అధికంగా పోలింగ్ శాతం నమోదు కావడమే లక్ష్యంగా ఫ్రీ రైడ్ ఆఫర్ చేస్తున్నట్లు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు పవన్ గుండపల్లి తెలిపారు.
ఇదే క్రమంలో... సిటీలో ఎక్కడి నుండైనా తమ తమ పోలింగ్ బూత్ లకు ఉచితంగా వెళ్లేందుకు తమ సంస్థ సహాయం చేస్తుందని.. పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలనుకునే ఓటర్లకు తమవంతుగా ఈ సాయం చేస్తామని పవన్ తెలిపారు. ఈ నేపథ్యంలో... తమ ఉచిత ప్రయాణ ఆఫర్ ముఖ్యంగా యువ ఓటర్లను ఆకర్షించడంలో ఉపయోగకరంగా ఉంటుందని వారు భావిస్తున్నారని తెలుస్తుంది.
రైడ్ ఇలా పొందాలి:!
పోలింగ్ జరిగే నవంబర్ 30వ తేదీన ఈ ఆఫర్ ను పొందాలనుకునే ఓటర్లు ముందుగా ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి! ఈ ర్యాపిడో యాప్ లో ఉచిత రైడ్ సేవల వినియోగానికి సంబంధించిన వివరాలు అక్కడ ప్రత్యక్షమవుతాయి. అనంతరం ఓటు వేయాల్సిన పోలింగ్ బూత్ ఎక్కడుందో టైప్ చేసిన తర్వాత "ఓట్ నౌ (Vote Now)" అనే వన్ టైం కూపన్ కోడ్ నమోదు చేస్తే ఉచిత రైడ్ బుక్ అవుతుంది!