అక్కడా.. ఇక్కడా.. అదానీనే హాట్ టాపిక్
నేటి నుంచి తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రెండు చోట్ల కూడా నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
పార్లమెంట్ సమావేశాలు ఇప్పటికే కొనసాగుతుండగా... నేటి నుంచి తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రెండు చోట్ల కూడా నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్షాల నుంచి అధికార పక్షాలకు ఒకేరకమైన నిరసన వ్యక్తమైంది. కానీ.. ఇక్కడ వినూత్న నిరసనలకు తావు ఇచ్చినట్లయింది. కేంద్రం బీజేపీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతుంటే.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై మీద బీఆర్ఎస్ నిరసనకు దిగింది. సేమ్.. అదే అదానీ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఒక చోట నిరసన తెలిపితే.. మరోచోట నిరసన ఎదుర్కోవాల్సి వస్తోంది.
లోక్‌సభలో అదానీ లంచం ఆరోపణలపై విపక్షాల ఆందోళన కొనసాగుతూనే ఉంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు అంటే శుక్రవారం నుంచే ఈ టాపిక్ హాట్‌హాట్‌గా సాగుతోంది. కాంగ్రెస్ ఎంపీలు మొదటి రోజే ఈ ఇష్యూపై పార్లమెంట్ బిల్డింగ్ ముందు ఆందోళనకు దిగారు. రాజ్యాంగ ప్రతులను చేతిలో పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తదితర ఎంపీలు పాల్గొన్నారు. ‘అదానీ-మోడీ భాయ్ భాయ్’ అంటూ ముఖానికి మాస్కులు ధరించి నినాదాలు చేశారు. బిలియనీర్ గౌతమ్ అదానీ ఇష్యూపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదానీ ముడుపుల వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని అన్నారు. అదానీ ముడుపుల వ్యవహారంపై సభలో చర్చ పెట్టాలని ప్రతిపక్ష పార్టీల ఎంపీలందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే.. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే బీఆర్ఎస్ నేతలు కాస్త రచ్చ చేశారు. సమావేశాల్లోకి వస్తుండగానే ఆవరణలో ఉత్కంఠ వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సహా హరీశ్ రావు, మిగితా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి, గౌతమ అదానీ ఫొటోలతో కూడిన టీషర్టులను ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు. దాంతో ఆవరణలోనే వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వానికి నినాదాలు చేశారు. అదానీ, రేవంత్ భాయ్ భాయ్ అంటూ నినాదాలు చేశారు. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంగా పోలీసులు కేటీఆర్, హరీశ్‌రావులను అరెస్ట్ చేశారు.
ఒకేరోజు పార్లమెంట్ వేదికగా, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ఒకే ఇష్యూపై రచ్చ నెలకొంది. అక్కడ ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పార్టీలు అదానీని టార్గెట్ చేస్తూ తమ నిరసనలు కొనసాగించాయి. అదానీకి రేవంత్ సపోర్టు చేస్తున్నారని, అందుకే గతంలో రూ.100 కోట్లు విరాళం ప్రకటించారని బీఆర్ఎస్ ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తోంది. ఇక అదే సందర్భంలో కేంద్రంలోని బీజేపీ కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది. అదానీకి మోడీ సర్కార్ అండగా నిలుస్తోందని, సంపదనంతా దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే.. బీఆర్ఎస్ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న రేవంత్ వెంటనే అదానీ విరాళాన్ని వెనక్కి ఇచ్చిన విషయం తెలిసిందే. దీని వెనుక కూడా రాహుల్ గాంధీ ఉన్నారని సమాచారం. రాహుల్ చెప్పడం వల్లే రేవంత్ విరాళాన్ని ఇచ్చేశారని ప్రచారం జరిగింది. మొత్తానికి అదానీ అంశం ఇప్పుడు కేంద్రంలోనే కాకుండా.. తెలంగాణ రాష్ట్రంలోనూ హాట్ టాపిక్‌గా నిలిచింది.