ఒక్క ఫోటో... రతన్‌ టాటాకు నెటిజన్ల హ్యాట్సాఫ్‌!

అవును... తాజాగా మూగజీవాలపై రతన్‌ టాటా చూపే ప్రేమకు ఓ హోటల్‌ నిదర్శనంగా నిలిచింది

Update: 2024-05-29 09:59 GMT

రతన్ టాటా ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అనే సంగతి దాదాపు అందరికీ తెలిసిందే.. అయితే... అంతకు మించిన మానవతావాది, మూగజీవాలపై అత్యంత ప్రేమ ఉన్న వ్యక్తి అనేది తక్కువ మందికి తెలుసని అంటుంటారు. అయితే... ఈ విషయంలో రతన్ టాటా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారనే కామెంట్లు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా అలాంటి సంఘటనే తెరపైకి వచ్చింది.

అవును... తాజాగా మూగజీవాలపై రతన్‌ టాటా చూపే ప్రేమకు ఓ హోటల్‌ నిదర్శనంగా నిలిచింది. దీంతో ఈ వ్యవహారంపై నెటిజన్లు రతన్ టాటాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ హెచ్‌.ఆర్‌. నిపుణురాలు రుబీ ఖాన్‌ తన లింక్డిన్‌ పోస్టులో వెల్లడించగా.. నెటిజన్ల కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ఈ సందర్భంగా మూగజీవాలకు సంబంధించి పలు రివక్స్టులు తెరపైకి వస్తున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... దేశంలోనే పేరున్న వ్యాపార దిగ్గజాలు, అంతర్జాతీయ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సంపన్నులు ముంబయిలో సేదదీరడానికి వచ్చే ప్రదేశం అంటే టక్కున చెప్పే తాజ్ మహల్ హోటల్ లో ఓ మానవీయ కోణం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... తాజాగా ప్రముఖ హెచ్‌.ఆర్‌. నిపుణురాలు రుబీ ఖాన్‌ ఒక పోస్ట్ పెట్టారు.

ఇందులో భాగంగా... తాను ఆ హోటల్‌ కు వెళ్లినప్పుడు ఓ వీధి శునకం ఎంట్రన్స్ పక్కనే నిద్రపోవడాన్ని గమనించినట్లు పేర్కొన్న రూబీ... చాలా విలాసవంతమైన ఆ ప్రదేశంలో అది ఎందుకు ఉందా అనే సందేహం వచ్చిందని తెలిపారు. దీంతో... అక్కడే ఉన్న సిబ్బందిని దాని గురించి ప్రశ్నించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా అక్కడున్న సిబ్బంది చెప్పిన సమాధానం విని రతన్‌ టాటాపై గౌరవం మరింత పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో... ఆ శునకం పుట్టినప్పటి నుంచి అక్కడే పెరిగిందని.. హోటల్‌ లో ఓ భాగమైపోయిందని.. అక్కడికి వచ్చే ఏ మూగ జీవాన్ని అయినా జాగ్రత్తగా చూసుకోవాలని రతన్‌ టాటా నుంచి విస్పష్టమైన ఆదేశాలున్నాయని సిబ్బంది వెల్లడించినట్లు తెలిపారు.

దీంతో నిత్యం వీవీఐపీలు వచ్చే ప్రతిష్ఠాత్మక సంస్థ వద్ద ఒక శునకం ప్రశాంతంగా నిద్రపోవడం తన మనసును తాకిందని రూబీ పేర్కొన్నారు. ఇంత గందరగోళం మధ్య కూడా ఆ ప్రదేశాన్ని అది సొంతదిగా భావించడం గొప్పవిషయం అని తెలిపారు. మనం తరచూ చెప్పే సైకలాజికల్‌ సేఫ్టీ, కలుపుగోలుతనం, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ వంటివి ఇక్కడ చేతల్లో కనిపించాయని అన్నారు.

ఈ నేపథ్యంలో ఈ పోస్టు లింక్డిన్‌ లో తీవ్ర వైరల్‌ గా మారింది. చాలా మంది యూజర్లు రతన్‌ టాటా మానవత్వానికి ఫిదా అవుతూ కామెంట్లు పెడుతున్నారు. నూటికో కోటికో ఒక్కరు రతన్ టాటాలా ఉంటారని చెబుతున్నారు.

కాగా... మూగజీవాలపై రతన్‌ టాటా ఎప్పుడూ ప్రేమను చూపిస్తూనే ఉంటారనే సంగతి తెలిసిందే. ఇందుకు ఉదాహరణగా... ఆయన తన వ్యాపార సామ్రాజ్య ప్రధాన కార్యాలయమైన బాంబే హౌస్‌ లో వీధి శునకాలకు ఏకంగా ప్రత్యేక గదినే కేటాయించారు.

Tags:    

Similar News