ఏడాది క్రితం రూ.వేల కోట్ల ఆస్తి.. ఇప్పుడు జీరో!
ఏడాది క్రితం వరకు వేల కోట్ల రూపాయల ఆస్తులతో దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కువ ఆస్తులున్నవారిలో ఒకరిగా నిలిచారు.. ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ.. బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్.
బళ్లు ఓడలు అవుతాయి.. ఓడలు బళ్లు అవుతాయని అంటారు. ఇప్పడు ఇదే జరిగింది. ఏడాది క్రితం వరకు వేల కోట్ల రూపాయల ఆస్తులతో దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కువ ఆస్తులున్నవారిలో ఒకరిగా నిలిచారు.. ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ.. బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్.
2011లో స్థాపించబడిన బైజూస్ త్వరగా భారతదేశపు అత్యంత విలువైన స్టార్టప్‌గా పేరు తెచ్చుకుంది, 2022లో 22 బిలియన్ డాలర్ల గరిష్ట విలువను చేరుకుంది.
కేజీ నుంచి పీజీ వరకు ఆన్లైన్ కంటెంట్, వివిధ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కు మెటీరియల్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు మెటీరియల్ వంటి వాటి ద్వారా బైజూస్ చిన్న స్టార్టప్ గా మొదలై అతి స్వల్పకాలంలోనే యూనికార్న్ (కనీసం 8 వేల కోట్ల రూపాయలు విలువ) హోదా ఉన్న కంపెనీగా ఎదిగింది.
అంతేకాకుండా భారత క్రికెట్ టీమ్ సభ్యులు ధరించే జెర్సీలపైన బైజూస్ దర్శనమిచ్చేది. మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ల్లో భారీ ఎత్తున యాడ్స్, వివిధ రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖలతో ఒప్పందాలు.. ఇలా మూడు పువ్వులు, ఆరు కాయలుగా బైజూస్ ప్రస్థానం సాగింది. ముఖ్యంగా కరోనా టైమ్ లో పాఠశాలలు మూతపడటంతో బైజూస్ వృద్ధి ఆకాశాన్ని తాకింది. నాడు అంతా ఆన్‌లైన్ కు అంకితం అయిపోవడంతో బైజూస్ వ్యాపారం పుంజుకుంది.
కరోనా లాక్ డౌన్ తర్వాత పాఠశాలలు తెరుచుకోవడం పిల్లలంతా స్కూళ్లకు వెళ్లిపోవడంతో బైజూస్ కు కష్టాలు మొదలయ్యాయి. సంస్థలో ముఖ్య ఉద్యోగుల మధ్య విభేదాలు కూడా నెలకొన్నాయి.
ఒక సంవత్సరం క్రితం, బైజూస్ రవీంద్రన్ నికర ఆస్తుల విలువ రూ. 17,545 కోట్లు (2.1 బిలియన్ డాలర్లు) ఉంది. దీంతో ఆయన ప్రపంచ బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అలాంటిది ఈ ఏడాది ఆయన నికర ఆస్తుల విలువ జీరోకి పడిపోయిందని ఫోర్బ్స్ బిలియనీర్ ఇండెక్స్ 2024 బాంబుపేల్చింది.
గత సంవత్సరం ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా నుండి ఈ ఏడాది కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే పడిపోయారని ఫోర్బ్స్ వెల్లడించింది. బైజూస్ సంస్థ అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. దాని విలువను బ్లాక్‌రాక్ సంస్థ 1 బిలియన్ డాలర్లకు తగ్గించింది.
మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బైజూస్ నిరాశజనక ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. గణనీయమైన నికర నష్టాన్ని వెల్లడించింది. దీంతో బ్లాక్ రాక్ సంస్థ.. బైజూస్ విలువను 1 బిలియన్ డాలర్లకు తగ్గించింది. ఇది దాని మునుపటి గరిష్ట వాల్యుయేషన్ 22 బిలియన్ డాలర్లతో పోలిస్తే తీవ్ర తగ్గుదలని సూచిస్తోంది.
ఓవైపు కంపెనీ నష్టాలు, మరోవైపు బైజూస్ ఉన్నత ఉద్యోగులతో రవీంద్రన్ కు ఉన్న విభేదాలు ఆ సంస్థ పుట్టి ముంచాయి. ఇటీవల షేర్ హోల్డర్లు.. రవీంద్రన్ ను సీఈవోగా తొలగించడానికి ఓటు వేశారు.
అంతేకాకుండా, బైజూస్ లోకి వచ్చిన విదేశీ పెట్టుబడులు ఎనఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టిలో పడ్డాయి. దాని వ్యవస్థాపకుడికి వ్యతిరేకంగా లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడానికి ముందు రూ. 9,362 కోట్లకు పైగా నిధులకు సంబంధించి విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనలు జరిగాయని బైజూస్ మాతృ సంస్థ.. థింక్ – లెర్న్‌కు ఈడీ షోకాజ్ నోటీసులు పంపింది.