బంగారాన్ని భారీగా కొంటున్న భారత్.. అసలు కారణం ఇదేనట

నివేదికల ప్రకారం భారత్ తో సహా కొన్ని దేశాలు జులైలో ఏకంగా 37 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా రిపోర్టు తేల్చింది.

Update: 2024-09-08 08:30 GMT

బంగారాన్ని కొన్ని దేశాలు అమ్మేస్తుంటే.. భారత్ తో సహా కొన్ని దేశాలు మాత్రం అదే పనిగా కొనేస్తున్నాయి. ఒక్క జులైలోనే భారత్ సహా కొన్ని దేశాలు భారీగా పసిడిని కొనేస్తున్నాయి. ఇంతకూ బంగారాన్ని పెద్ద ఎత్తున ఎందుకు కొంటున్నట్లు? దాని వెనకున్న వ్యూహం ఏమిటి? అసలు బంగారాన్ని భారీగా కొనుగోలు చేయటం మంచిదేనా? ఆర్థిక వ్యవస్థకు ఇదెలా సాయం చేస్తుందన్న సందేహాలు పలువురిలో వ్యక్తమవుతూ ఉంటాయి. అలాంటి సందేహాలను ఈ కథనం తీర్చేస్తుంది.

నివేదికల ప్రకారం భారత్ తో సహా కొన్ని దేశాలు జులైలో ఏకంగా 37 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా రిపోర్టు తేల్చింది. రష్యా - ఉక్రెయిన్, గాజా - ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధాలు.. పర్యావరణ కారణాలతో ప్రపంచంలోని పలు దేశాలు బంగారాన్ని భారీగా కొనుగోలు చేయటానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని దేశాలు మాత్రం తమ వద్ద ఉన్న బంగారం నిల్వల్ని అమ్మేస్తున్న పరిస్థితి.

బంగారాన్ని కొనుగోలు చేస్తున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉండటం గమనార్హం. ఈ ఏడాది రెండో త్రైమాసికం అంటే ఏప్రిల్ - జూన్ మధ్యన ఉన్న మూడు నెలల కాలంలో బంగారం కొనుగోళ్లలో భారత్ రెండో స్థానంలో నిలిచినట్లుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది.

భారత్ తో పాటు బంగారాన్ని కొనుగోలు చేసే ఇతర దేశాల్ని చూస్తే..

పోలండ్

తుర్కియే

ఉజ్బెకిస్తాన్

చెక్ రిపబ్లిక్ దేశాలు

అదే సమయంలో బంగారాన్నిఅమ్మేస్తున్న దేశాలు ఉన్నాయి. ఆ జాబితాను చూస్తే..

- కజకిస్తాన్

- సింగపూర్

- జర్మనీ

బంగారం నిల్వలు ఏ దేశానికైనా ముఖ్యమైన ఆస్తిగా పరిగణించటం గురించి తెలిసిందే. బంగారం కేంద్ర బ్యాంకులకు స్థిరాస్తిగా వ్యవహరిస్తారు. ఆర్థిక సంక్షోబాల వేళ ఆర్థిక వ్యవస్థలను ఒక కొలిక్కి తెచ్చేందుకు బంగారం తోడ్పాటును అందిస్తుంది. గతంలోకి వెళితే.. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు సమయంలో ఎదురైన ఆర్థిక సంక్షోభ వేళ.. దాని నుంచి బయటపడేందుకు బంగారాన్ని భారీగా అమ్మిన వైనం తెలిసిందే. అప్పట్లో అదో పెద్ద సంచలనంగా మారింది.

ఇంతకూ బంగారాన్ని ఎందుకు కొన్నిదేశాలు భారీగా కొనేస్తున్నాయి. పసిడి నిల్వలల మీద ఫోకస్ ఎందుకు? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని చూస్తే.. ఆర్థిక వేత్తల నుంచి వస్తున్న సమాధానాల్ని చూస్తే..

- బంగారం కేంద్రబ్యాంకులకు స్థిరాస్తిగా పని చేస్తుంది.

- అమెరికా డాలర్ కు రిజర్వ్ కరెన్సీ హోదా ఉంది.

- అనేక బ్యాంకులు డాలర్ మీద ఆధారపడటాన్ని తగ్గించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నాయి.

- బంగారం కొనుగోళ్లతో డాలర్ మీద ఆధారపడటం తగ్గించాలని భావిస్తున్నాయి.

- డాలర్ పతనం కావటం.. అమెరికా వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు.. అదే జరిగితే డాలర్ విలువ తగ్గే అవకాశం ఉంది. అందుకే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.

- భారతదేశం కూడా డాలర్లకు బదులు బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. బంగారు నిల్వల్ని భారీగా కొనుగోలు చేయటం ద్వారా మరిన్ని కరెన్సీ నోట్లను ముద్రించే వీలుంది. బంగారం కొనేందుకు భారత్ ఆసక్తికి ఇదో కారణం కావొచ్చు.

- ప్రపంచ వ్యాప్తంగా ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. ఏదైనా అనుకోనిది జరిగి కరెన్సీ విలువలు పడిపోయి.. బంగారం ధర పెరుగుతుంది. అలా చూసుకున్న బంగారం కొనుగోలు చేసిన దేశాలు ఆర్థికంగా మరింత బలపడే వీలుంది.

Tags:    

Similar News