హ‌మ్మ‌య్య‌! ఊపిరి పీల్చుకున్న తెలుగు రాష్ట్రాలు!

ఇలాంటి వాద‌న‌ల‌కు, స‌మ‌స్య‌ల‌కు తాజాగా జ‌రిగిన‌ ముఖ్య‌మంత్రుల భేటీ కొంత దూరం పాటించ‌డం ఆశావ‌హ దృక్ఫ‌థ‌మ‌నే చెప్పాలి.

Update: 2024-07-07 11:30 GMT

ఉభ‌య తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న త‌రుణం రానే వ‌చ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు శ‌నివారం భేటీ అయ్యారు. మ‌రి ఈ భేటీ చ‌రిత్ర సృష్టించిందా? అంటే.. ప్ర‌స్తుతానికి అయితే.. ఒకింత మేల‌నే మాటే వినిపిస్తోంది. ఎందుకంటే.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత‌.. త‌లెత్తిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించడం.. కేంద్రానికి కూడా సాధ్యం కావ‌డం లేదు. పైగా కొన్ని కొన్ని విష‌యాలు స్థానిక ప్ర‌జ‌ల మ‌నోభావాలు, స‌మాజాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణ‌యించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ముఖ్య‌మంత్రుల మ‌ధ్య ఇగో ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారిన నేప‌థ్యంలో ప‌దేళ్ల‌లో ఏనాడూ.. ఈ త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపించ‌నందున ఇప్పుడు జ‌రిగిన సమావేశం కొంత‌లో కొంత మేలేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

విభ‌జ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం గ‌తంలో కేసీఆర్.. జ‌గ‌న్ ప్ర‌య‌త్నించారు. అయితే.. ఇద్ద‌రూ కూడా ఇత‌ర అంశాల్లో రాజీ ప‌డ్డారు. కానీ, విభ‌జ‌న అంశాల్లో మాత్రం రాజీ ప‌డ‌లేకపోయారు. దీనికి కార‌ణం.. ఇరు రాష్ట్రాల్లోనూ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ముడి ప‌డి ఉండ‌డ‌మే. ఉదాహ‌ర‌ణ‌కు జ‌ల స‌మ‌స్య‌ను తీసుకుంటే.. కృష్ణాన‌ది జ‌లాల వ్య‌వ‌హార‌మే ఇర‌కాటంగా మారింది. ఈ జ‌లాల్లో 512 టీఎంసీల‌ను ఏపీకి కేటాయించారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌కు 299 టీఎంసీల ను ఇచ్చారు. దీనికి తెలంగాణ అడ్డుప‌డుతోంది. త‌మ‌కు 518 టీఎంసీలు కావాల‌ని ప‌ట్టుబ‌డుతోంది. తాజా భేటీలో జ‌ల స‌మ‌స్య‌ను ప‌క్క‌న పెట్టారు.

వాస్త‌వానికి జ‌నాభా లెక్క ప్ర‌కారం ఏపీ-తెలంగాణ కు 58:42 ప్రాతిప‌దిక‌న ఆస్తుల‌ను పంచాలి. ఇలానే పంచుకోవాల‌ని కూడా దీనిపై ఏర్ప‌డిన రెండు కీల‌క క‌మిటీల పెద్ద‌లు సూచించారు. అయితే.. ఈ విభ‌జ‌న ప్రాతిప‌దిక పోయి.. తెలంగాణ‌లో సొంత అజెండాలు తెర‌మీదికి వ‌చ్చాయి. 512 టీఎంసీలను ఏపీకి.. 299 టీఎంసీలు తెలంగాణకు బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించినా... తెలంగాణ నదీ పరీవాహక ప్రాంత విస్తీర్ణం.. కరువు, జనాభా ప్రాతిపదికన 70.80% జలాలను తమకు కేటాయించాలని తెలంగాణ కోరుతోంది. ఈ వాద‌న వీగిపోతోంది. దీనికి ఏపీ స‌సేమిరా అంటోంది.

ఇలాంటి వాద‌న‌ల‌కు, స‌మ‌స్య‌ల‌కు తాజాగా జ‌రిగిన‌ ముఖ్య‌మంత్రుల భేటీ కొంత దూరం పాటించ‌డం ఆశావ‌హ దృక్ఫ‌థ‌మ‌నే చెప్పాలి. వాటిని ప‌రిష్క రించే ప్ర‌య‌త్నం యుద్ధం ప్రాతిప‌దిక‌న కాకుండా.. చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుందామ‌ని తేల్చారు. మ‌రో కీల‌క వ్య‌వ‌హారం ఆస్తుల విభ‌జ‌న విష‌యంలో తెలంగాణ వైపు నుంచి ఉన్న‌ తీవ్ర రాజ‌కీయ ప్ర‌మేయం.. అత్యుత్సాహం.. వంటివాటిని ఇప్పుడు త‌గ్గించే దిశ‌గా అడుగులు ప‌డ్డాయి. ప్ర‌స్తుతం జ‌రిగిన ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌మావేశానికి ఇది అడ్డంకి కాకుండా మార‌డం ఆశించ‌ద‌గిన ప‌రిణామ‌మే.

సాధ్య‌మైనంత వ‌ర‌కు స‌మావేశాన్ని ఆశాజ‌న‌కంగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. కాబ‌ట్టి.. స‌మావేశం ముగిసినా.. స‌మ‌స్య‌లు తీరేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని భావించినా.. మొత్తానికి ఇరు రాష్ట్రాల మ‌ధ్య కొంత నీలిమ‌బ్బుల వంటి వాతావ‌ర‌ణం.. అయితే కొంత మేర‌కు స‌మ‌సింది. ఇది మంచి ప‌రిణామ‌మ‌నే చెబుతున్న పరిశీల‌కులు. మ‌రో రెండు మూడు సిట్టింగుల్లో అయినా.. స‌మ‌స్య‌లు స‌జావుగా ప‌రిష్కారం అయ్యేందుకు తాజా భేటీ మార్గం చూపింద‌ని చెబుతున్నారు.

Tags:    

Similar News