బందర్ లో డ్యాన్స్ చేస్తున్న అమ్మాయితో పోకిరీల రచ్చ.. కట్ చేస్తే?

వినాయక నిమజ్జనమే కాదు.. చాలా కార్యక్రమాలకు రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసే కల్చర్ ఏపీలో ఎక్కువగా ఉంటుంది

Update: 2023-09-28 04:31 GMT

వినాయక నిమజ్జనమే కాదు.. చాలా కార్యక్రమాలకు రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసే కల్చర్ ఏపీలో ఎక్కువగా ఉంటుంది. పండగల సందర్భంగా ఏర్పాటు చేసే పందిళ్ల దగ్గర.. గ్రామాల్లో నిర్వహించే తిరునాళ్ల సందర్భంగానూ యువతులతో ప్రత్యేక రికార్డింగ్ డ్యాన్సుల్ని ఏర్పాటు చేస్తుంటారు. ఇటీవల కాలంలో వినాయక నిమజ్జనం సందర్భంగానూ ఇలాంటివి ఏర్పాటు చేయటం ఎక్కువైంది. తాజాగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాలోని బందర్ లో నిర్వహించిన రికార్డింగ్ డ్యాన్స్ సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమకు సమస్య ఎదురైన డ్యాన్సర్లలో ఒకరు ఫోన్ చేసిన 8 నిమిషాల వ్యవధిలో దిశ పోలీసులు ఎంట్రీ ఇవ్వటం.. వారిని సేఫ్ గా ఇంటికి తరలించిన వైనం చోటు చేసుకుంది.

విజయవాడకు చెందిన ఐదుగురు టీం (ఇద్దరు అబ్బాయిలు.. ముగ్గురు అమ్మాయిలు) బందర్ లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన నిమజ్జన కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు వేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా అర్థరాత్రి వేళ వీరు డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఒక డ్యాన్సర్ తో కొందరు పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించారు. యువతి డ్రెస్ లాగి ఇబ్బందులకు గురి చేశారు. దీంతో.. డ్యాన్స్ గ్రూపులోని ఇతర సభ్యులు పోకిరీలను వారించే ప్రయత్నం చేయగా.. వారిపై దాడికి దిగి.. బూతులు తిట్టసాగారు.

దీంతో హడలిపోయిన బాధితురాలు వెంటనే దిశ యాప్ ద్వారా పోలీసులకు వీడియో కాల్ చేసి పరిస్థితిని వివరించింది. సరిగ్గా ఎనిమిది నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడకు రావటం.. యువతితో అసభ్యంగా ప్రవర్తించిన పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతికి ధైర్యాన్ని చెప్పి.. వారంతా విజయవాడకు క్షేమంగా వెళ్లే వరకూ మానిటర్ చేశారు. పోకిరీల విషయాన్ని తెలుసుకున్న గ్రామపెద్దలు రంగంలోకి దిగి.. వారిని మందలించారు. ఆపదలో ఉన్న వారు దిశ యాప్ ద్వారా కాల్ చేసిన నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకోవటం.. బాధితురాలికి అండగా నిలిచిన వైనం గురించి తెలిసిన వారంతా పోలీసుల్ని అభినందిస్తున్నారు.

Tags:    

Similar News