‘సోషల్’ స్ట్రాటజీని నమ్ముకున్న కాంగ్రెస్.. రేవంత్ ఏం ఆదేశాలిచ్చారు?

ప్రస్తుతం ట్రెండ్ అంతా సోషల్ మీడియాదే. సోషల్ మీడియా ప్రజలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నదో అందరికీ తెలిసిందే.

Update: 2024-09-23 12:30 GMT

ప్రస్తుతం ట్రెండ్ అంతా సోషల్ మీడియాదే. సోషల్ మీడియా ప్రజలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నదో అందరికీ తెలిసిందే. X కానీ.. ఇన్ స్టా కానీ.. ఫేస్ బుక్ కానీ.. ఇలా ఏ ప్లాట్ ఫాం తీసుకున్నా ప్రతీదాంట్లోనూ ప్రజలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు. అయితే.. సోషల్ మీడియా వాడకంలోనూ పలు పార్టీలు ముందు వరుసలో ఉన్నాయి. నిత్యం తమ పార్టీ గురించి వివరిస్తూనే.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు వాడుతున్నారు. ఏ చిన్న అంశాన్ని అయినా సోషల్ మీడియా వేదికగా ఎత్తిచూపుతున్నారు.

పార్టీల మధ్య నిత్యం సోషల్ మీడియాలో విమర్శలు, ప్రతివిమర్శలు చూస్తూనే ఉంటాం. లేదంటే స్కామ్‌లు, అవినీతి అక్రమాలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తుంటారు. ఒకవేళ ప్రభుత్వాలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే.. ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న సేవలను, అమలు చేస్తున్న పథకాలను, తీసుకుంటున్న కొత్త కొత్త నిర్ణయాలను ఎప్పటికప్పుడు అందులో పోస్ట్ చేస్తుంటారు. రోజూ పార్టీల మధ్య, అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఏదో ఒక రచ్చ సైతం సోషల్ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి కనిపిస్తూనే ఉంటుంది. ఒకనొక సందర్భాల్లో సోషల్ మీడియా పార్టీల గెలుపు, ఓటములపైనా ప్రభావితం చూపిస్తున్న దాఖలాలూ ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి అన్ని పార్టీలకు సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. నిత్యం ఆయా పార్టీలు, ఆయా పార్టీల నేతల అప్‌డేట్స్ అందులో పడుతూనే ఉంటాయి. అయితే.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను వాడడంలో అన్ని పార్టీల కంటే ముందుంది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్న ఎక్స్ అకౌంటులో ఆ పార్టీ చాలావరకు యాక్టివ్ రోల్ పోషిస్తోంది. ముందు నుంచీ ఆ పార్టీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ సైతం అటు నేతలకు, ఇటు కార్యకర్తలకు చాలా సందర్భాల్లోనూ సూచించారు.

ఈ క్రమంలో ఇటీవల రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి బాధ్యత చేపట్టి కూడా పది నెలలు గడిచింది. అయితే.. రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆయనపై అటాక్ చేస్తూనే ఉంది. నిత్యం సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో పోస్టు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడుతోంది. కేటీఆర్ నిత్యం రేవంత్ పై, కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై ట్వి్ట్టర్ వేదికగా ఫైర్ అవుతూనే ఉన్నారు. ఆయనతోపాటే హరీశ్ రావు, ఇంకా చాలా మంది నేతలు తమతమ అభిప్రాయాలను, విమర్శలను పంచుకుంటున్నారు.

అయితే.. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి తాము సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంచనాకు వచ్చారు. ఆ పార్టీ ప్రభుత్వం వైఫల్యాలంటూ పెద్ద మొత్తంలో అబద్ధాలు ప్రచారాలు చేస్తుంటే.. పార్టీ నుంచి కానీ, ప్రభుత్వం తరఫున కానీ అంత స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోతున్నామని నేతలతో అన్నారట. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయం తీసుకున్నారని టాక్.

ఎంతసేపూ ప్రెస్‌మీట్లు పెట్టి కౌంటర్లు ఇస్తున్నప్పటికీ.. వాటికి మీడియాలో ప్రచారం లభిస్తున్నప్పటికీ అంతగా మైలేజ్ రావడం లేదని రేవంత్‌ మనసులో నాటుకుపోయినట్లు తెలిసింది. అందుకే.. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాతోపాటు ప్రభుత్వంలోని ఆయా విభాగాలకు సంబంధించిన అధికారిక ‘X’ అకౌంట్లను మరింత యాక్టివ్ చేయాలని ఆదేశాలిచ్చారని సమాచారం. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై అప్పటికప్పుడు ఆయా విభాగం నుంచే కౌంటర్ వెళ్లాలని సూచించారట. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి పాజిటివిటిని తీసుకెళ్లాలని ఆయన ఉద్దేశమని తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు, కాంట్రాక్టులు, టెండర్లు ఇలాంటి విషయాల్లో బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు వెంటనే అంతే స్పీడుతో కౌంటర్ అటాక్ చేయాలని సూచించినట్లు తెలిసింది

Tags:    

Similar News