పార్టీ విధానమే ప్రభుత్వ విధానం: రేవంత్ రెడ్డి
ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఇచ్చిన హామీని నెరవేర్చి తీరుతుం దని చెప్పారు.
పార్టీ విధానమే ప్రభుత్వ విధానమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఇచ్చిన మాటకు.. ప్రభుత్వం తప్పకుండా నిలబడుతుందన్నారు. గాంధీల కుటుంబం అంటే.. ఇచ్చిన మాటకు కట్టుబడి నడిచే కుటుంబమని చెప్పారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఇచ్చిన హామీని నెరవేర్చి తీరుతుం దని చెప్పారు. ఈ మేరకు తాజాగా ఆయన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం బీఆర్ ఎస్ పార్టీ నుంచి రైతు బంధు వ్యవహారంపై రేవంత్ సర్కారుపై ఒత్తిడి పెరుగుతున్న విష యం తెలిసిందే. పైగా దీపావళి సందర్భంగా కూడా.. ఆయనపై ఈ వ్యవహారం ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రతిపక్షాలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మాట ఇచ్చాక మరో చర్చకు తావుండదని సీఎం చెప్పుకొచ్చారు. ఎన్నో దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చి సోనియా గాంధీ మాట నిలబెట్టుకున్నారని చెప్పారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతిహామీని నిలబెట్టుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. పార్టీ అజెండా.. ప్రభుత్వ అజెండా రెండూ ఒక్కటేనని తెలిపారు. ``నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీనే ఈ గుర్తింపు ఇచ్చింది. ఎంతో మంది కష్టపడితేనే నాకు ముఖ్యమంత్రి సీటు దక్కింది`` అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇక, పదవుల వేటలో ఉన్న తెలంగాణ నాయకులకు కూడా రేవంత్ రెడ్డి చురకలు అంటించారు.
నాయకులు బాధ్యతగా పనిచేస్తే.. పనికి తగ్గ ఫలితం ఎందుకు రాదని ఆయన ప్రశ్నించారు. అధికారుల ను, నాయకులను సమన్వయం చేసే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ కష్టపడితేనే.. రాష్ట్రంలో సుపరిపాలన అందించడం సాధ్యమవుతుందని చెప్పారు. నవంబరు పూర్తయ్యే నాటికి కుల గణనను పూర్తి చేసి తీరతామని రేవంత్ చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.