రేవంత్ టాలెంటే వేరప్పా.. మోడీతో ఫోటో వేళ మంత్రి శ్రీధర్ బాబు

తాజాగా మరోసారి ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలవటం.. ఆయనకు రాష్ట్ర అవసరాల గురించి చెప్పటం.. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరటం లాంటివి చేశారు.

Update: 2025-02-27 05:02 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలి సమకాలీన సీఎంలకు కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పాలి. బీజేపీయేతర ముఖ్యమంత్రుల్లో అత్యంత చురుగ్గా ఉండటమే కాదు.. తరచూ ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో భేటీ కావటం.. రాష్ట్రానికి అవసరమైన పనుల గురించి అడిగి చేయించుకోవటం కనిపిస్తుంది. బీజేపీతో ఏ మాత్రం పొసగని కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ ను ఇట్టే పొందే సీఎంగా ఆయనకు మంచి పేరే ఉంది.

తాజాగా మరోసారి ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలవటం.. ఆయనకు రాష్ట్ర అవసరాల గురించి చెప్పటం.. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరటం లాంటివి చేశారు. నిజానికి ఈ అంశాలతో కూడిన వివరాలు.. వార్తలు ఇప్పటికే వచ్చేశాయి. వారు చెప్పిందే మేం చెబితే అందులో అర్థమే లేదు. మరి.. మేం ఏం చెబుతున్నామంటారా? అక్కడికే వస్తున్నాం. ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం భేటీ సందర్భంగా కొన్ని ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి.

అందులో ఒకటి గంటకు పైగా సమావేశం సాగటం. అంత టైం చాలా తక్కువ మందికి మాత్రమే ప్రధాని మోడీ ఇస్తారన్నది మర్చిపోకూడదు. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. తనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు.. సీఎస్ శాంతికుమారి.. సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితరుల్ని తన వెంట పీఎంవోతో తీసుకెళ్లారు. కానీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖాముఖిన గంట పాటు మాట్లాడుకోవటం.. ఈ సందర్భంగా పలు అంశాల్ని షేర్ చేసుకోవటం విశేషం.

అయితే.. బయట నుంచి చూసినప్పుడు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రధాన మంత్రి మోడీకి పుష్పగుచ్చం ఇచ్చిన ఫోటో మాత్రం బయటకు రావటం.. విస్త్రతంగా ప్రచారం కావటం చూసినప్పుడు రేవంత్ టాలెంట్ ను చూసి ముచ్చట చెందాల్సిందే. అప్పుడప్పుడు సీఎం రేవంత్ నోటి నుంచి ఒక మాట వస్తూ ఉంటుంది. ఎన్నికల వేళలోనే రాజకీయం. మిగిలిన రోజుల్లో పాలనే. సరిగ్గా ఇలాంటి మాటే ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి తరచూ వస్తూ ఉంటుంది. కానీ.. ఆయన ఏం చేస్తారు? ఎలా వ్యవహరిస్తారు? అన్నది అందరికి తెలిసిందే.

ఇలా చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం లేకుండా చేసే రేవంత్.. తమ పార్టీకి ఏ మాత్రం పడని ప్రధానమంత్రి వద్దకు వెళ్లి.. రాష్ట్ర అవసరాలకు సంబంధించిన అంశాల్ని వివరంగా మాట్లాడటం.. అందరిని కలుపుకు వెళ్లామన్న భావనను కలిగించేలా చేయటం మాత్రం రేవంత్ టాలెంట్ కు నిదర్శనంగా చెప్పక తప్పదు. తెలంగాణ కోరిన అంశాలన్నింటినీ కచ్చితంగా పరిశీలిస్తామని.. రాష్ట్ర డెవలప్ మెంట్ కు సహకరిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చినట్లుగా సీఎం రేవంత్ పేర్కొనటం గమనార్హం.

Tags:    

Similar News