కీలక పదవులపై రేవంత్‌ కసరత్తు.. ముఖ్య పదవులు తన వారికే!

ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన బల్మూరి వెంకట్, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ లను ఎమ్మెల్సీ పదవులు వరించాయి.

Update: 2024-01-19 05:38 GMT

తెలంగాణ ముఖ్యమంత్రిగా నెల రోజుల పరిపాలనను పూర్తి చేసుకుని విజయవంతంగా రెండో నెలలోకి ప్రవేశించారు.. రేవంత్‌ రెడ్డి. మొదటి నెల పాలనలోనే అన్ని వర్గాల ప్రజల అభినందనలు ఆయన అందుకున్నారు. ప్రస్తుతం దావోస్‌ పర్యటనను ముగించుకుని లండన్‌ లో పర్యటిస్తున్న రేవంత్‌ ఇప్పుడు కీలక పదవులపై దృష్టి సారించారని తెలుస్తోంది.

ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన బల్మూరి వెంకట్, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ లను ఎమ్మెల్సీ పదవులు వరించాయి. ఇదే కోవలో ఇతర కీలక పదవులపైన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టి సారించారని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ కారణాలతో పార్టీ న్యాయం చేయలేనివారికి, పార్టీ గెలుపు కోసం కష్టపడ్డవారితోపాటు తనకు మొదటి నుంచి అన్ని రకాలుగా అండదండలుగా ఉన్న వారికి రేవంత్‌ పదవులు ఇవ్వనున్నారని చెబుతున్నారు.

వీరిలో ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ వేం నరేందర్‌ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి కేబినెట్‌ మంత్రి హోదాతో ప్రభుత్వ సలహాదారు పదవి, మరొకరికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి దక్కవచ్చని టాక్‌ నడుస్తోంది.

వేం నరేందర్‌ రెడ్డి గతంలో టీడీపీలో రేవంత్‌ రెడ్డితోపాటు పనిచేశారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. రేవంత్‌ రెడ్డితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2015లో ఎమ్మెల్సీగా వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించే ప్రయత్నంలో భాగంగానే రేవంత్‌ రెడ్డిపై నాడు ఓటుకు నోటు కేసు ఆరోపణలు వచ్చాయి.

ఇక మండవ వెంకటేశ్వరరావు టీడీపీ తరఫున పలు పర్యాయాలు నిజామాబాద్‌ జిల్లా నుంచి గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. వాస్తవానికి మండవ వెంకటేశ్వరరావుకు న్యాయం చేస్తామని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆయనను తన పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఆయనకు ఇప్పటివరకు ఎలాంటి పదవి ఇవ్వలేదు.

ఈ నేపథ్యంలో వేం నరేందర్‌ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిని ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఓటుకు నోట కేసు వీరిద్దరిని చుట్టుముట్టినా వేం నరేందర్‌ రెడ్డి తొణకలేదు. అప్పటి నుంచి రేవంత్‌ రెడ్డితో స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి ఎన్నికయ్యాక ఆయనకు వెనుకండి వేం నరేందర్‌ రెడ్డి అండదండలు అందించారు. రేవంత్‌ తోపాటు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వేం నరేందర్‌ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా కీలక స్థానం కట్టబెట్టాలనే యోచనలో రేవంత్‌ ఉన్నారని తెలుస్తోంది.

మండవ వెంకటేశ్వరరావు, వేం నరేందర్‌ రెడ్డిలతోపాటు అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, షబ్బీర్‌ అలీ తదితర నేతలకు సైతం కీలక పదవులు అప్పగిస్తారని చర్చ జరుగుతోంది. వీరికి కేబినెట్‌ మంత్రి హోదాతోనే పదవులు ఉంటాయని అంటున్నారు.

Tags:    

Similar News