తెలంగాణ అసెంబ్లీలో `సబిత` రగడ.. తీవ్ర దుమారం సభ వాయిదా!
తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్ ఎస్ పార్టీ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వ్యవహా రం తీవ్ర దుమారం రేపింది.
తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్ ఎస్ పార్టీ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వ్యవహా రం తీవ్ర దుమారం రేపింది. ఏకంగా సభను వాయిదా వేసే పరిస్థితి వచ్చింది. స్పీకర్ చాలా సేపు ఇరు పక్షాలకు సర్ది చెప్పినా.. ఎవరూ సంయమనం పాటించలేదు. పైగా పోడియం ముందు సబిత నిరసనకు దిగారు. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. దీంతో అసలు సభలో ఇంత రగడకు దారి తీసిన సబిత వ్యవహారం ఏంటనేది ఆసక్తిగా మారింది.
సభలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్ మధ్య తీవ్ర మాటల యు ద్ధం కొనసాగింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సబిత పేరు ఎత్తకుండా కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో కేటీఆర్‌కు వెనుక సీట్లోనే సబిత కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పేరు ఎత్తకుండానే.. రేవంత్ మాట్లాడుతూ.. ``నీ(కేటీఆర్) వెనుక కూర్చున్న అక్కల(సబిత)ను నమ్ముకోవద్దు. మోసం చేస్తారు`` అని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సబిత.. అనూహ్యంగా చెప్పాపెట్టకుండా వెళ్లి కేసీఆర్ కు జై కొట్టారు. ఈ క్రమంలోనే మంత్రి పదవి కూడా తెచ్చుకున్నారు.
దీనిని ఉద్దేశించి రేవంత్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అంతే! ఒక్కసారిగా సబిత ఆందోళనకు దిగారు. ``నేనేం మోసం చేశానోచెప్పాలి`` అంటూ బిగ్గరగా అరుస్తూ.. పోడియం ముందుకు దూసుకువచ్చారు. అంతేకాదు.. తాను ఎవరిని ముంచానో.. ఎవరికి ద్రోహం చేశానో చెప్పాలని నిలదీశారు. ఆమెకు బబీఆర్ ఎస్ నాయకులు కూడా కలిసి వచ్చారు. దాదాపు 10 మంది వరకు ఎమ్మెల్యేలు పోడియంను చుట్టుముట్టి బైఠాయించారు. ఈ సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి జోక్యం చేసుకుని సభ్యులు నిరసన విరమించాలని అన్ని అంశాలపైనా మాట్లాడదామని చెప్పారు.
అయినప్పటికీ సబిత శాంతించలేదు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టారు. ఈ సమయంలో కొన్ని వ్యాఖ్యలు చేస్తూ.. ``రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంచి మనసుతో ఆయనను ఆహ్వానించా. పార్టీలోకి రా తమ్ముడు... వస్తే ఈ పార్టీకి (కాంగ్రెస్) భవిష్యత్తులో ఆశాకిరణం అవుతావని రేవంత్ రెడ్డికి చెప్పింది నేనే`` అని చెప్పారు. అంతేకాదు..ఫ్యూచర్‌లో సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందని తానే చెప్పానన్నారు. ``అలా చెప్పలేదని గుండెమీద చేయి వేసుకొని చెప్పాలి`` అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ ప్రతిసారీ తనను లక్ష్యంగా చేసుకుని సూటి పోటిమాటలు అంటున్నారని.. తాను ఏ పాపం చేశానని.. తనపై ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. సీఎం చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. అంతేకాదు.. ఇక్కడ ఎవరెవరు.. ఏయే పార్టీలు మారారో కూడా చర్చించేందుకు తాను సిద్ధమని అన్నారు.ఈ గందరగోళం శృతి మించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.