సీఎం రేవంత్ కాన్వాయ్ నల్లకారు కథ తెలిస్తే వావ్ అనేస్తారు

రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నంతనే.. భారీ వాహన శ్రేణితో ఉండే కాన్వాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

Update: 2023-12-15 05:37 GMT

రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నంతనే.. భారీ వాహన శ్రేణితో ఉండే కాన్వాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకేలాంటి వాహనాలు పెద్ద ఎత్తున సాగుతూ.. ఎందులో ముఖ్యమంత్రి ఉంటారో తెలీనట్లుగా సాగే కాన్వాయ్ కు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఉంటోంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడని విధంగా.. మూడు రంగుల్లో రేవంత్ కాన్వాయ్ వాహనాలు ఉంటున్నాయి. అందులోనూ బ్లాక్ కలర్ కారు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ కారులోనే ముఖ్యమంత్రి రేవంత్ ప్రయాణిస్తున్నారు.

అంతేకాదు.. కాన్వాయ్ లోని మిగిలిన వాహనాల నెంబర్లు ఒకలా ఉంటే.. బ్లాక్ కార్ నెంబరు మరొకటి ఉంటోంది. ఎందుకిలా? అసలు ఈ బ్లాక్ కారు ఎందుకు ఉంది? అన్నప్రశ్నకు తాజాగా సమాధానం లభించింది. ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నామంటే.. డబ్బుల్ని నీళ్ల మాదిరి ఖర్చు చేసే సీఎంలకు భిన్నంగా రేవంత్ వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రభుత్వం సమకూర్చే కారులో కాకుండా.. తనసొంత వాహనంలోనే ముఖ్యమంత్రిగా కూడా ప్రయాణిస్తున్నారు.

ఈ కారణంతోనే ముఖ్యమంత్రి వాహన శ్రేణిలో మిగిలిన కార్లకు భిన్నంగా బ్లాక్ కారు ఉంటోంది. విలాసాలకు దూరంగా.. వీలైనంత సింఫుల్ గా ఉండాలన్నదే తన లక్ష్యమంటున్న రేవంత్.. ఇప్పటికే ప్రజాభవన్ లో ఉండేందుకు నో చెప్పటం తెలిసిందే. ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రజాభవన్ లో కాకుండా తన సొంత ఇంట్లోనే ఉంటున్నారు. చివరకు కారును సైతం తన కారులో తానే ప్రయాణిస్తున్నారే తప్పించి.. ప్రభుత్వ వాహనాన్ని కూడా వినియోగించటానికి ఇష్టపడటం లేదు.

కొత్త కాన్వాయ్ ను కొనుగోలు చేస్తామని అధికారులు అడిగారని.. కానీ తాను వద్దని చెప్పినట్లు చెబుతున్నారు. బుల్లెట్ ఫ్రూఫ్ కారునే ఉపయోగించాలని భద్రతా అధికారులు చెప్పటంతో.. తన సొంతకారునే బుల్లెట్ ప్రూఫ్ చేయాల్సిందిగా చెప్పినట్లు చెప్పారు. కొత్త బుల్లెట్ ఫ్రూఫ్ కాన్వాయ్ కొనాలంటే మళ్లీ రూ.50 కోట్లు అవసరమవుతాయి.. తను ఒక్క పైసా కూడా వేస్టు చేయమని చెప్పటం గమనార్హం.

ఇదంతా ఒక ఎత్తు గతం నుంచి ఉన్న కాన్వాయ్ లోని కార్ల సంఖ్యను కూడా తగ్గించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మొత్తంగా చూస్తే.. గతంలో మాదిరి కాకుండా.. ప్రతి పైసా ఆచితూచి ఖర్చు చేసేలా రేవంత్ అడుగులు ఉన్నాయని చెప్పాలి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి.. ఢిల్లీ వెళ్లే ప్రతి సారీ ప్రైవేటు ఫ్లైట్ తీసుకుంటారా? లేదంటే.. కొందరు ముఖ్యమంత్రుల మాదిరి విమానంలో ప్రయాణిస్తారా? అన్నది చూడాలి. ఒకవేళ ప్రత్యేక విమాన సౌకర్యాన్నివదిలేసి.. మామూలుగా విమాన ప్రయాణం చేస్తే మాత్రం.. తెలంగాణ రాష్ట్రానికి కొత్త రోజులు వచ్చినట్లే. అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు పట్టించుకోకుండా ఖర్చు చేసే ధోరణికి చెక్ వేసేలా ఉన్న రేవంత్ ను అభినందించాల్సిందే.

Tags:    

Similar News