ఫలితం వెల్లడి కాకుండానే ఓపెన్ ఆఫర్ ఇచ్చేసిన రేవంత్
ఫలితం మీద పాజిటివ్ కోణంతో పాటు.. తెలంగాణ అధికారపక్షానికి చెందిన నేతలను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
దూకుడు ప్రదర్శిస్తున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దశ దాటిన వేళ.. బయటకు వచ్చిన ఎగ్జిట్ పోల్ తో విజయం మీద ధీమా ఆయనలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మిగిలిన కాంగ్రెస్ నేతలకు భిన్నంగా ఆయన మాటలు ఉంటున్నాయి. ఫలితం మీద పాజిటివ్ కోణంతో పాటు.. తెలంగాణ అధికారపక్షానికి చెందిన నేతలను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అదే సమయంలో అధికారపక్షంలో కలకలాన్ని రేపేలా ఉండటం గమనార్హం.
తాము పాలకులం కాదని.. ప్రజలకు సేవకులం మాత్రమేనని చెబుతున్న రేవంత్.. కేసీఆర్.. కేటీఆర్.. కవిత.. హరీశ్ రావులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీలోని నలుగురే ప్రజలకు శత్రువులుగా పేర్కొన్నారు. ఇన్నాళ్లూ కేసీఆర్ కుటుంబంతో అంటకాగిన వారు ప్రజలకు క్షమాపణలు చెప్పి సేవకులుగా ఉండాలన్న రేవంత్ మాటల్ని చూసినప్పుడు.. గులాబీ నేతల్లో ఆ నలుగురు తప్పించి మిగిలిన వారెవరైనా సరే.. తమకు ఆమోదయోగ్యమన్న మాటను చెప్పినట్లుగా చెబుతున్నారు.
ఎగ్జిట్ ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉన్నాయని స్పస్టం చేస్తున్నా.. తేడా కొట్టి కాస్త తేడా పడినా.. అందుకు అవసరమైన గ్రౌండ్ ను రేవంత్ తన మాటలతో ప్రిపేర్ చేసినట్లు అయ్యిందంటున్నారు. బీఆర్ఎస్ లో ఆ నలుగురు ముఖ్యనేతలు మినహా మిగిలిన వారు ఎవరైనా సరే.. తమకు కోపం లేదన్న మాటలో ముందు చూపు కనిపిస్తుందని చెప్పాలి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలపై అయోమయంలో ఉన్న గులాబీ అధినాయకత్వానికి రేవంత్ నోటి నుంచి వచ్చిన మాటలు ఇబ్బందికరంగా మారతాయని చెబుతున్నారు.
తాను ఏ పదవిలో ఉండాలో.. ఏ నియోజకవర్గానికి రాజీనామా చేయాలో పార్టీ అధినాయకత్వం నిర్ణయం చేస్తుందన్న రేవంత్.. ఎక్కడా ఒక్క మాటను అనవసరంగా మాట్లాడటం కనిపించదు. గెలుపు క్రెడిట్ మొత్తం సోనియా ఖాతాలో వేసిన రేవంత్.. ‘‘ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజల్ని సోనియా కోరారు. కాంగ్రెస్ కార్యకర్తల పోరాటం ఫలించబోతోంది’’ అని వ్యాఖ్యానించారు. మొత్తంగా రేవంత్ మాటలు ముందుచూపుతో ఉన్నట్లుగా చెబుతున్నారు.