దావోస్ లో రేవంత్ దూకుడు... కీలక సమావేశాలివే!
దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సమావేశమయ్యారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ముఖ్యమంత్రిగా తనదైన దూకుడు ప్రదర్శిస్తున్న రేవంత్ రెడ్డి.. విదేశీ పర్యటనలోని కీలక సమావేశాల విషయంలోనూ తనదైన దూకుడిని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా... దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు.
అవును... దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సమావేశమయ్యారు. ఐటీ, జీవ వైద్య శాస్త్ర రంగానికి ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ సామర్ధ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు, భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం పలువురు ప్రముఖులతో కీలక చర్చలు జరిపింది.
ఇందులో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్ తో పాటు నిర్వాహకులు, ఇతర ప్రముఖులతోనూ తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో పాటు తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు.
అనంతరం ఇథియోఫియా డిప్యూటీ ప్రధాన మంత్రి డెమెక్ హసెంటో తో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్ పై చర్చించారు. ఇదే సమయంలో... అసోషియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ ప్రెసిడెంట్ శ్రీమతి దేబ్జానీ ఘోష్ తోనూ సమావేశమయ్యారు.
ఇందులో భాగంగా... ప్రధానంగా స్కిల్ డెవలప్ మెంట్ పై దృష్టిసారించే దిశగా చర్చలు జరిపారు. ఈ క్రమంలో... రాష్ట్రంలో స్కిల్ డెవెలప్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించటంతోపాటు.. దానికోసం అనుసరించే మార్గాలపైనా ప్రధానంగా చర్చించారు. ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న యువతకు స్కిల్ డెవెలప్మెంట్ సాయం అందించే అంశాలపై సంప్రదింపులు జరిపారు.
కాగా... వరల్డ్ ఎకనమిక్ ఫోరం 54వ వార్షిక సదస్సు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతోన్న సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదర్స్సు కోసం దావోస్ టూర్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుకు పలువురు ప్రవాసీ భారత ప్రముఖులు ఘన స్వాగతం పలికారు.