కాంగ్రెస్ లోకి చేర్చుకోవటంపై అధిష్ఠానాన్ని రేవంత్ ఎలా ఒప్పించారు?

పాలన మీద ఫోకస్ కంటే ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేసే పనిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువ కసరత్తు చేస్తున్నారా?

Update: 2024-07-06 05:04 GMT

పాలన మీద ఫోకస్ కంటే ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేసే పనిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువ కసరత్తు చేస్తున్నారా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఒకటి తర్వాత ఒకటి చొప్పున జరుగుతున్న పరిణామాల్ని చూసినప్పుడు కొత్త సందేహాలకు తెర తీశారు రేవంత్. జాతీయ స్థాయిలో ఫిరాయింపులపై తమ పార్టీ అధినాయకత్వం వినిపించే వాదనలకు భిన్నంగా తమ ఏలుబడిలో ఉన్న తెలంగాణలో పరిస్థితులు ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో పార్టీ అనుసరిస్తునన వైఖరికి కాంగ్రెస్ ఏదో రోజు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి.. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవటానికి అధినాయకత్వం ఎందుకు సిద్ధమైంది?

చేరికల విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అనుసరిస్తున్న విధానానికి కాంగ్రెస్ అధినాయకత్వం ఎందుకు అంగీకరించింది? దాని వెనుకున్న మర్మమేంది? లాంటి ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. చేరికల విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం అంత ఆసక్తిగా లేదని.. పాలన మీదనే ఎక్కువ ఫోకస్ చేయాలని రేవంత్ కు సూచన చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. సంఖ్యా బలం తమకు అంత అనుకూలంగా లేకపోవటం.. కేసీఆర్ వేసే ఎత్తులను చిత్తు చేయాలంటే తాము సైతం కొన్ని పద్దతుల్ని పాటించాల్సి ఉంటుందన్న విషయాన్ని రేవంత్ వివరంగా చెప్పినట్లు తెలుస్తోంది.

అన్నింటికి మించి.. అధికారపక్షంగా ఉన్న తాము చేరికల విషయంలో సానుకూలంగా స్పందించకుంటే.. వారి చూపు ప్రత్యామ్నాయాల మీద పడే వీలుందన్న విషయాన్ని చెప్పినట్లుగా సమాచారం. చేరికలకు తాము సిద్ధంగా లేకుంటే.. బీజేపీ వారిని తమ పార్టీలో చేర్చుకోవటానికి సిద్ధమవుతుందని.. అప్పుడు తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని.. అదే జరిగితే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందన్న లాజిక్ ను కాంగ్రెస్ పెద్దలకు అర్థమయ్యేలా రేవంత్ వివరించారని చెబుతున్నారు. ఈ కారణంతోనే.. పెద్ద ఎత్తున చేరికలకు ప్లాన్ చేస్తున్న రేవంత్ అండ్ కో ప్రయత్నాలకు కాంగ్రెస్ అధినాయకత్వం పచ్చజెండా ఊపినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News