సర్కార్ అంటే కూల్చివేతలు.. ఢిల్లీ టూర్లేనా రేవంత్?

హైడ్రా పేరుతో తీసుకొచ్చిన ఒక కొత్త వ్యవస్థ బాగానే ఉన్నా.. అవసరానికి మించిన తొందరపాటు రానున్న రోజుల్లో రేవంత్ సర్కారును ఇబ్బందుల్లోకి నెడుతుందని చెబుతున్నారు.

Update: 2024-08-23 09:30 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించటం.. అంచనాలకు తగ్గట్లే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డికి.. వచ్చీ రాగానే సవాళ్లు స్వాగతం పలికాయి. కాసుల గలగలలు కాకున్నా.. కొంతమేర లోటు ఉన్నా.. బండి లాగించేందుకు ఎలాంటి సమస్యలు ఉండవన్న భావనలో రేవంత్ ఉండటం.. అలాంటిదేమీ లేదంటూ ఖాళీగా దర్శనమిచ్చిన బొక్కసంతో షాక్ తినటం రేవంత్ వంతైంది.

ప్రభుత్వానికి ఆదాయ మార్గాల్ని పెంచుకోవటంతో పాటు.. కుదేలైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒక దరికి చేర్చటమే లక్ష్యగా రేవంత్ వ్యవహరిస్తారన్న ప్రచారం జరిగింది. ఆ దిశగా కొంత కసరత్తు జరిగిన మాట వాస్తవం. అంతలోనే.. సార్వత్రిక ఎన్నికలకు తెర లేవటంతో పాటు.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. దీంతో పాలనపై ప్రబావం పడింది. ఎన్నికల కోడ్ ఎత్తేసిన తర్వాత మళ్లీ పాలన ఒక గాడిన పడేందుకు కాస్తంత టైం తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలుఅలాంటిదేమీ లేదన్న విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది.

హైడ్రా పేరుతో తీసుకొచ్చిన ఒక కొత్త వ్యవస్థ బాగానే ఉన్నా.. అవసరానికి మించిన తొందరపాటు రానున్న రోజుల్లో రేవంత్ సర్కారును ఇబ్బందుల్లోకి నెడుతుందని చెబుతున్నారు. అక్రమార్కుల తోలు తీయటం మంచిదే అయినా.. బాధితులు మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతి వారు అవుతారన్న విషయాన్ని మిస్ అవుతున్నారు. నాలుగు కూల్చివేతలతో సంచలనంగా మారటం బాగానే ఉన్నా.. రానున్న రోజుల్లో వచ్చే చికాకులు ప్రభుత్వానికి కంట్లో నలుసులా మారుతాయని చెబుతున్నారు.

కూల్చివేతలు తొలుత సంచలనంగా.. తర్వాతి రోజుల్లో వివాదాస్పదంగా మారి.. రాజకీయ రచ్చకు తెర తీసే వీలుంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా డౌన్ అయ్యిందన్న మాట పెరిగింది. రోజులు గడిచే కొద్దీ.. ఈ మాట రేవంత్ సర్కారుకు నెగిటివ్ గా మారింది. ప్రభుత్వం కొలువు తీరి దగ్గర దగ్గర ఎనిమిది నెలలు కావొస్తున్నా.. డెవలప్ మెంట్ విషయంలో ఇప్పటికి ఒక మార్కు పడలేదన్న విమర్శ ఉంది. ఇదిలా ఉంటే.. అదే పనిగా ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీకి వెళ్లటాన్ని తప్పు పడుతున్నారు.

అయితే.. కూల్చివేతలు.. లేదంటే ఢిల్లీకి వెళ్లటం లాంటి వాటికే రేవంత్ సర్కారు పరిమితమవుతుందున్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి బదులుగా డెవలప్ మెంట్ మీద ప్రభుత్వ ఫోకస్ ఎక్కువగా ఉందన్న భావన కలిగించటంలో వెనుకబడి ఉన్నారంటున్నారు. తెల్ల ఏనుగు లాంటి మూసీ ప్రాజెక్టు.. పేరుకు ఫ్యూచర్ సిటీ కానీ.. వాస్తవంలో దాన్ని ఏర్పాటు చేయటం అంత తేలికైన విషయం కాదన్న మాట అధికారుల నోటి నుంచే వినిపిస్తున్న పరిస్థితి. వేలాది కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యే ప్రాజెక్టులను తలకెత్తుకునే కన్నా.. త్వరగా పూర్తై.. ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చే అంశాల మీద ఫోకస్ పెడితే బాగుండన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భారీ ప్రాజెక్టులతో ఇమేజ్ తెచ్చుకునే కన్నా.. హైదరాబాద్ మహానగర పచ్చదనం.. పరిశుభ్రత.. తాగునీరు ఇబ్బందుల్లేకుండా చూడటం.. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.. కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణాల్ని వేగంగా పూర్తి చేయటం లాంటి అంశాల మీద ఫోకస్ పెడితే బాగుండన్న మాట వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ మరేం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News