భవిష్యత్తు హైదరాబాద్ మీద భయం పెంచిన రేవంత్ రెడ్డి

ప్రతీ ఏటా లక్షలలో జనాలు హైదరాబాద్ కి ఉపాధి ఉద్యోగ, వ్యాపార అవసరాల నిమిత్తం వస్తున్నారు.

Update: 2024-10-05 17:11 GMT

ప్రపంచంలో ఒక మామూలు దేశానికి ఉన్న జనాభా అలాగే భౌగోళిక విస్తీర్ణం హైదరాబాద్ కి ఉన్నాయి. కోటి మంది జనాభాతో హైదరాబాద్ ప్రపంచంలోని అనేక దేశాల కంటే ముందు ఉంది. అలాగే భౌగోళికంగా చూస్తే కనుక హైదరాబాద్ నగరం దక్షిణ భారతదేశంలో మూసీ నది ఒడ్డున దక్కన్ పీఠభూమి ఉత్తర భాగంలో ఉంది. ఆధునిక హైదరాబాద్ 1,005 కిలోమీటర్లు మేర విస్తీర్ణంలో విస్తరించి ఉంది, ఇది భారతదేశంలోని అతి పెద్ద మెట్రోలలో ఒకటిగా నిలిచింది.

హైదరాబాద్ అతి పెద్ద ఉపాధి కేంద్రం. అలాగే అతి పెద్ద ఆరోగ్య కేంద్రం. పారిశ్రామిక కేంద్రం. లేనిది ఏదీ హైదరాబాద్ లో లేదు. దక్షిణాదిన కీలకమైన నగరంగా ఉంది. ప్రతీ ఏటా లక్షలలో జనాలు హైదరాబాద్ కి ఉపాధి ఉద్యోగ, వ్యాపార అవసరాల నిమిత్తం వస్తున్నారు.

ఎందరు వచ్చినా అక్కున చేర్చుకుని వారికి ఇంత ఉపాధిని అందించే కల్చర్ ఆ పొటెన్షియాలిటీ హైదరాబాద్ కి ఉంది. అందుకే దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కి జనాలు పొట్ట చేత బట్టుకుని వస్తున్నారు.

అలాంటి హైదరాబాద్ లో జనాభా విస్ఫోటనం భయం పొంచి ఉంది. వచ్చిన వారికి తాగేందుకు వాడేందుకు నీరు ఉండాలి కదా. నివాసాలు ఉండాలి కదా. ఇది మేధావులు వేసే ప్రశ్న. ఇక హైదరాబాద్ లో భూగర్భంలో నీటి మట్టాలు బాగా తగ్గిపోతున్నాయి. గతంలో యాభై వంద అడుగులు తవ్వితే తగిలే నీరు ఇపుడు పదిహేను వందల అడుగులు తవ్వినా రావడం లేదు అని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు

ఆయన తెలంగాణా కీలక రాజకీయ నాయకుడు కె వెంకటస్వామి జయంతి వేడుకలలో మాట్లాడుతు భవిష్యత్తు హైదరాబాద్ దర్శనం చేయించారు. హైడ్రా తో ఆక్రమణలను కూల్చివేయకపోతే ఇపుడున్న హైదరాబాద్ ఏదో నాటికి మాయం అవుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

వాన పడితే నదుల్లా ఉప్పొంగే వీధులతో జనాలకు జల బుల్డోజర్ వస్తుందని కూడా హెచ్చరించారు. హైడ్రా బుల్డోజర్ ఎందుకు అంటున్న వారు రేపటి హైదరాబాద్ గురించి కూడా ఆలోచించాలని ఆయన కోరారు. మన చెరువులు నాలాలు గుంటలు మూసీ నదులను పూర్తిగా పూడ్చేస్తే వచ్చే నీరు ఎక్కడికి పోవాలని ఆయన ప్రశ్నించారు.

అలాగే భూగర్భంలో నీటి మట్టాలు పెరగకపోతే హైదరాబాద్ దాహార్తికి ఎవరు జవాబు చెబుతారని నిలదీశారు. తాము మూసీ నదిని ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నామని అందుకే పేదలను వేరే చోటకు తరలించి మంచి జీవితం ఇవ్వాలని చూస్తున్నామని అన్నారు. ఇదే మూసీ నది నుంచి వచ్చె అ విషాన్ని నల్గొండ వాసులు తాగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికి వందేళ్ళ క్రితం 1907లో నిజాం నవాబు ఆనాడు హైదరాబాద్ వరదలతో మునిగిపోతే మళ్లీ ఆ పరిస్థితి రాకుండా చెరువులు గుంటాలు తవ్వించారని గుర్తు చేశారు. వాటిని ఆక్రమాలతో నింపేస్తూ పోతే రేపటి హైదరాబాద్ ఎలా బతుకుతుందని ఆయన ఆలోచనాపరులకు ఒక కీలకమైన మౌలికమైన ప్రశ్నను సంధించారు.

హైదరాబాద్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అలాగే సుందరమైన నగరంగా తీర్చిదిద్దాల్సి ఉందని కూడా ముఖ్యమంత్రి అన్నారు. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి తీసుకుని వచ్చిన హైడ్రాకు అత్యధిక శాతం ప్రజానీకం మద్దతు ఇస్తున్నారు. హైడ్రా ఉండాల్సిందే అని కోరుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా హైడ్రా విషయంలో పట్టుదలగా ఉంది. చెరువులు నాలాలు ఆక్రమించిన వారి భరతం పడుతోంది. హైడ్రాకు అపరిమితమైన అధికారాలు ఇస్తూ ఆర్డినెన్స్ ని లేటెస్ట్ గా జారీ చేసింది. దానిని అసెంబ్లీలో ఆమోదించుకోవడం ద్వారా న్యాయపరంగా ఇబ్బందులు లేకుండా చేసుకుని అనుకున్న లక్ష్యాలను సాధించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోంది.

ఇక మూసీ నది వద్ద అక్రమాలన విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్ధించుకుంటూ రేపటి భాగ్యనగరం కోసమే ఇదంతా అని రేవంత్ రెడ్డి చక్కగానే వివరించారు. జనంలోకి దానిని చర్చకు పెట్టారు మరి విపక్షాలు దీనికి ఓకే అంటాయా లేక ఆందోళన బాట పడతాయా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News