రాజరిక ముద్రలే కానీ అమరవీరులకు చోటు ఉండొద్దా కేటీఆర్?

సిత్రమైన వాదనను వినిపిస్తుంటారు మాజీ మంత్రి కేటీఆర్. మంచిగా మాట్లాడటం వచ్చినంత మాత్రాన తాను మాట్లాడే మాటలన్ని మంచిగా ఉంటాయని అనుకోవటం అత్యాశే అవుతుంది.

Update: 2024-05-29 05:22 GMT

సిత్రమైన వాదనను వినిపిస్తుంటారు మాజీ మంత్రి కేటీఆర్. మంచిగా మాట్లాడటం వచ్చినంత మాత్రాన తాను మాట్లాడే మాటలన్ని మంచిగా ఉంటాయని అనుకోవటం అత్యాశే అవుతుంది. ఇందుకు నిలువెత్తు రూపంగా కేటీఆర్ ను చెప్పాలి. ఆయన మంచి మాటకారి అన్న విషయం తెలిసిందే. అంతమాత్రాన తనకు నచ్చని ప్రతి అంశంలోనూ అన్యాయం.. అరాచకాన్నిచూసే కేటీఆర్.. అదే విషయాన్నిప్రజలు కూడా నమ్మాలని ఆయన కోరుకుంటూ ఉంటారు. ఆయన చెప్పే కొన్ని మాటల్లో లాజిక్కు కించిత్ కనిపించదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణ అధికార ముద్రను మార్చాలని భావిస్తున్నారు.

ఇప్పుడున్న రాజముద్రలో రాజరిక పోకడలు.. వాటి వాసనలే ఉన్నాయని.. వాటి స్థానంలో తెలంగాణ కోసం జనులు చేసిన పోరు కనిపించేలా ఉండాలన్న వాదనపై కేటీఆర్ గయ్యిమంటున్నారు. రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్ష తో రాష్ట్ర అధికారచిహ్నాన్ని చెరిపేస్తే సహించమని చెబుతున్న కేటీఆర్.. ‘‘పౌరుషానికి ప్రతీక అయిన ఓరుగల్లు సాక్షిగా కాంగ్రెస్ సర్కారు సంకుచిత నిర్ణయాలపై సమర శంఖం పూరిస్తాం. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్ర.. సాంస్క్రతి వారసత్వానికి ప్రతీకలైన కాకతీయ తోరణం.. చార్మినార్ ఉండటం రాచరిక పోకడ అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించటం కరెక్టు కాదు. వెయ్యేళ్ల సాంస్క్రతి వైభవానికి చిహ్నాలు. పదేళ్లుగా ప్రభుత్వ అధికారిక చిహ్నంపై తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ చెప్పిన మాటల్లో ప్రతి అంశాన్ని తరచి చూస్తే.. ఆయన మాటల్లోని డొల్లతనం కనిపిస్తుంది.

- పౌరుషానికి ప్రతీక అయిన ఓరుగల్లు సాక్షిగా కాంగ్రెస్ సర్కారు సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తాం.

వేయేళ్ల కాకతీయ తోరణం.. వందల ఏళ్ల చార్మినార్ ను రాజముద్రలో పెట్టటం సరే. మరి.. తెలంగాణ కోసం అమరవీరుల ప్రాణాలు అర్పించిన సామాన్యులు రాజముద్రలో ఎందుకు భాగస్వామ్యం కాకూడదు. వారి ఆశలు.. ఆకాంక్షల్ని అనుక్షణం గుర్తుకు తెచ్చుకునేలా రాజముద్రలో వారు ఉండొద్దా? చరిత్రను కొనసాగించాలనే కేటీఆర్.. వర్తమానాన్ని ఎందుకు భాగస్వామ్యం చేయొద్దని భావిస్తున్నారు?

కేసీఆర్ ఉద్యమం చేశారు సరే. ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది ఎవరు ఉద్యమకారులు కాదా? ఉద్యమకారులు.. అమరవీరులు లేకుంటే తెలంగాణ ఏర్పాటు సాధ్యమేనా? వెయ్యి మంది కేసీఆర్ లు ఉన్నప్పటికీ.. గుప్పెడు అమరవీరులు లేకుంటే కేంద్రం మీదా ఒత్తిడి వచ్చేదా? తెలంగాణ సమాజం కదిలేదా? అసేతు హిమాచలం తెలంగాణ వేదనను అర్థం చేసుకునేదా? అలాంటప్పుడు అమరవీరుల ఊసు లేని రాజముద్ర.. ఒక రాజముద్రేనా? దీని కోసమే కేటీఆర్ అంతలా తపిస్తున్నారా?

- పదేళ్లుగా ప్రభుత్వ అధికార చిహ్నంపై తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉంది

పదేళ్లుగా ప్రభుత్వ అధికార చిహ్నంపై తెలంగాణ సమాజం ఏమీ అనట్లేదు.. అందరూ ఆమోదించారన్న కేటీఆర్ మాటల్ని చూస్తేనే ఆయనలోని అహంకారం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. కేసీఆర్ చేతికి అధికారిక పగ్గాలు వచ్చేసిన తర్వాత.. తీసుకున్న ఏ నిర్ణయంలో అయినా తెలంగాణ సమాజం పాలు పంచుకున్నదా? ఎంతసేపటికి ప్రగతిభవన్.. ఫాంహౌస్ వేదికగా తీసుకున్న నిర్ణయాలే కోట్లాది తెలంగాణ ప్రజల మీద రుద్దారే తప్పించి.. వారి వాదనను.. వేదనను.. మాటల్ని పరిగణలోకి తీసుకున్నారా? అన్నది ప్రశ్న.

ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిపై కేసులతో విరుచుకుపడటం.. వివిధ రూపాల్లో ఒత్తిళ్లు తీసుకొచ్చి నోట్లో నుంచి మాట రాకుండా చేసిన కేసీఆర్ సర్కారు గురించి కేటీఆర్ చెప్పే మాటల్ని చూస్తే.. పదేళ్ల అవస్థల తెలంగాణ ఏదీ కల్వకుంట్ల కుటుంబానికి తెలియలేదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణ సమాజం ఆమోదించిందని చెప్పే కేటీఆర్.. ఏ రోజున ప్రజల మనసుల్ని.. ప్రజల ఆలోచనల్ని.. ప్రజల భావోద్వేగాల్ని కేసీఆర్ పట్టించుకున్నారో కేటీఆర్ చెబితే బాగుంటుంది. తమకు నచ్చింది తెలంగాణకు నచ్చినట్లుగా.. తాము తెలంగాణ అని.. తెలంగాణ అంటే తమ కుటుంబం అన్నట్లుగా వ్యవహరించే కేటీఆర్ ఇప్పటికైనా వాస్తవాన్ని గుర్తిస్తే బాగుంటుంది.

- కాకతీయ కళా తోరణం.. చార్మినార్ తొలగించటమంటే తెలంగాణ చరిత్రను చెరిపేయటమే

కేటీఆర్ తో ఇదే సమస్య. తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్లు అన్నట్లుగా ఆయన మాటలు ఉంటాయి. తాము ఏదైతే డిసైడ్ చేశారో.. దాన్నే పాటించాలని ఎందుకు భావిస్తారు? కాకతీయ కళాతోరణాన్ని.. చార్మినార్ ను తక్కువ చేయట్లేదు. కానీ.. అదే సమయంలో తెలంగాణ రాజముద్రలో అమరవీరుల స్తూపం ఎక్కడుంది? అన్న ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఏమిటి? తెలంగాణ రాజముద్రలో అమరవీరులు వద్దా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే.

- రాజకీయ కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే ఊరుకోం?

రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి అధికారిక చిహ్నాన్ని మారుస్తున్నారని అనుకుందాం. అదే నిజమైతే.. ఆయనకు తగిన శాస్తి లభిస్తుంది కదా? ఇవాళ ఎవరూ మాట్లాడకపోవచ్చు. కానీ.. తెలంగాణ సమాజం అంగీకరించలేని చేష్టల్ని అధికారంలో ఉన్న ఎవరు చేసినా.. అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అందుకు రేవంత్ మినహాయింపు కాదు. కానీ.. రేవంత్ ప్రభుత్వం తెర మీదకు తీసుకురానున్న రాజముద్రలో ఏముందో? ఏమి లేదో? అన్నది చూడకుండానే.. కేటీఆర్ తన నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదు కదా? రేవంత్ సర్కారు రాజముద్రను చూసిన తర్వాత ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటే బాగుంటుంది. అందుకు భిన్నంగా మాట్లాడటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయాన్ని కేటీఆర్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

Tags:    

Similar News