ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తానంటున్న సీఎం రేవంత్ రెడ్డి
వారు ఇలాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతుంటే మేం విని ఊరుకోం. మేం కూడా రాజకీయం చేస్తాం.
కాంగ్రెస్ పాలన వంద రోజులు పూర్తి చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు పడగొడితే పడిపోవడానికి మాది బలహీన ప్రభుత్వం కాదని బలమైన ప్రభుత్వమని చెబుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కువ సీట్లు సాధించుకుని ఏర్పరచుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టడం అంత తేలిక కాదని అంటున్నారు.
వారు ఇలాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతుంటే మేం విని ఊరుకోం. మేం కూడా రాజకీయం చేస్తాం. ప్రభుత్వాన్ని పడగొట్టడమంటే మాటలు కాదు. దానికి ఏం పథకాలు వేస్తారో వేసుకోండి. మేం కూడా తయారుగానే ఉన్నాం. మీ కుట్రలు, కుతంత్రాలను కూకటి వేళ్లతో పెకిలిస్తాం. మాకు కూడా రాజకీయం చేయడం తెలుసు. మీరు చేసేది చూస్తూ ఊరుకోం. స్పందిస్తాం. మీ అంతు చూస్తాం అని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ పాలన వంద రోజులు పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీట్ ది మీడియా ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతల మాటలు చూస్తుంటే జాలేస్తోంది. చిన్న పిల్లల మాదిరి మాట్లాడుతుండటం వారి నైజం. మా ప్రభుత్వాన్ని పడగొడతామని చెబుతుంటే వారి తెలివితక్కువ తనానికి నవ్వొస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని పడగొట్టడమంటే ఏదో పేక మేడ కూల్చినట్లుగా అనుకుంటున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారు? మాకు బలం లేదా? ఎమ్మెల్యేలు లేరా? మా పథకాలు అమలు చేయడం లేదా? దేని మీద ఆరోపణలు చేస్తారు? ఏ పాయింట్ లేకపోయినా ఇలా మాట్లాడటం వారికే చెల్లుతుందని అంటున్నారు. ఇలా ప్రతిపక్ష నేతల మాటలకు తగిన గుణపాఠం చెబుతామని చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు పాలిస్తుంది. ఎవరి దయ దాక్షిణ్యాల మీదో ఆధారపడలేదు. మాకు సంపూర్ణ మెజార్టీ ఉంది. బయట నుంచి ఎవరి బలమైనా తీసుకుంటే వారి ఆగ్రహానికి బలి కావాల్సి వస్తుంది. అంతేకాని మాకు ఎవరి బలం అవసరం లేదు. ఎవరి ప్రోత్సాహంతో పని లేదు. స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మాకు ఎవరి వల్ల భయం ఉండదనే విషయం వారికే తెలియాలి.