బీజేపీని దేశవ్యాప్తంగా 'రిజర్వ్' చేసిన రేవంత్.. ఆ బ్రహ్మాస్త్రంతో కమలం దిక్కులు

400 సీట్లు గెలిస్తే.. రాజ్యాంగాన్ని మారుస్తామన్న అనంత్ కుమార్ కు టికెట్ ఇవ్వకుండా బీజేపీ జాగ్రత్తపడింది. కానీ, ఆ వ్యాఖ్యలను సరిగ్గా అందిపుచ్చకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

Update: 2024-05-14 10:45 GMT

హ్యాట్రిక్ గ్యారెంటీ.. సొంతంగానే 370 పైగా సీట్లు.. కూటమికి 400 దాటడం ఖాయం.. ఇవీ ఈ ఎన్నిలకు ముందు బీజేపీ అగ్ర నేతలు చేసిన వ్యాఖ్యలు. తీరా ఎన్నికల సమరం సగానికి వచ్చేసరికి ఆ పార్టీ నాయకులు ఓ అంశం చుట్టూనే పరిభ్రమించాల్సి వస్తోంది. అటు అయోధ్య రామాలయ నిర్మాణం వేవ్.. ఇటు ఆర్టికిల్ 370 రద్దు చేసిన ఘనత.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు తమ సొంతమని చెప్పుకోవాలని భావించిన బీజేపీకి ఒక్కటే ఒక్క షాట్ తో చుక్కలు చూపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఒకవేళ దేశంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాలేదు అంటే.. దాంట్లో ఈ కారణమే ప్రధానం కావొచ్చు.

అందుకే 400 సీట్లు అడుగుతోందా?

ఈసారి కూడా గెలిస్తే వెయ్యేళ్లు గుర్తుంచుకునేలా పాలన అందిస్తాం.. అని ప్రధాని మోదీ గతంలో చెప్పారు. అసాధారణ పాలనపరమైన నిర్ణయాలతో పదేళ్లు దేశాన్ని పాలించిన మోదీ మాటలకు చాలామంది వివిధ రకాలుగా భాష్యం చెప్పారు. కాగా, ఇదే సమయంలో ఎన్నికల ముందు బీజేపీ కర్ణాటక నేత అనంత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అంతటా చర్చనీయాంశం అయ్యాయి. తమకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటూ ఆయన ఏ ఉద్దేశంలో మాట్లాడారో కానీ.. అవే బీజేపీని విమర్శల సుడిగుండంలోకి నెట్టాయి.

సంజాయిషీ చెప్పుకోలేక..

400 సీట్లు గెలిస్తే.. రాజ్యాంగాన్ని మారుస్తామన్న అనంత్ కుమార్ కు టికెట్ ఇవ్వకుండా బీజేపీ జాగ్రత్తపడింది. కానీ, ఆ వ్యాఖ్యలను సరిగ్గా అందిపుచ్చకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ తమకు 400 సీట్లు ఇవ్వాలని అడిగేది.. బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల రద్దుకేనంటూ ఓ కొత్త పాయింట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లారు రేవంత్. ఇది బ్రహ్మాస్త్రంగా పనిచేసింది. దీనికితోడు తెలంగాణలోని సిద్దిపేటలో పర్యటించిన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ముస్లిం రిజర్వేషన్లపైనా మాట్లాడారు. అంతా కలిసి ప్రచారం రిజర్వేషన్ రద్దు చుట్టూ తిరిగేలా అయింది.

బీజేపీకి దెబ్బపడితే అది రేవంత్ తోనే తెలంగాణలో ఏడాదిన్నర కిందటివరకు బీజేపీ అధికారంలోకి వస్తుందనే భ్రమ కలిగింది. కానీ, దానిని తన నాయకత్వ పటిమతో తిప్పికొట్టారు రేవంత్ రెడ్డి. అంతేకాక, పార్టీని గెలిపించి సీఎం కూడా అయ్యారు. ఇప్పుడు ''బీజేపీ 400 సీట్లు-రిజర్వేషన్ రద్దు'' పాయింట్ ను సరిగ్గా పట్టుకుని కమలం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఒకవేళ బీజేపీకి గనుక ఈ ఎన్నికల్లో దెబ్బపడితే అది కేవలం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వదిలిన బాణంతోనే అనుకోవాలి.

Tags:    

Similar News