అర్ధరాత్రి ఆందోళన .. రేవంత్ రేపిన చిచ్చు !
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు. ఈ విషయాన్ని అనేక వేదికల మీద కాంగ్రెస్ నేతలు, మంత్రులు ఒప్పుకున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు. ఈ విషయాన్ని అనేక వేదికల మీద కాంగ్రెస్ నేతలు, మంత్రులు ఒప్పుకున్నారు. ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల ముందు హైదరాబాద్ లో నిరుద్యోగులు శిక్షణ పొందే పలు కోచింగ్ సెంటర్లకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు వారికి డబ్బులు ఇచ్చి రాష్ట్రంలో బస్సు యాత్రలు నిర్వహింపచేసి బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకువస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేయించారు.
అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గతంలో ఇచ్చిన హామీలను విస్మరించడమే కాకుండా అప్పుడు తమ వద్దకు వచ్చిన కాంగ్రెస్ నేతలు ప్రస్తుత ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రస్తుతం గ్రంథాలయ చైర్మన్ అయిన రియాజ్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంలు నిరుద్యోగుల డిమాండ్లు వినడానికి మొకం చాటేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే అప్పట్లో ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నిరుద్యోగుల వద్దకు తీసుకువచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే నిరుద్యోగుల గురించి పలుచన చేసి మాట్లాడడం నిరుద్యోగులలో అసహనాన్ని పెంచుతుంది. రేవంత్ వ్యవహారం పండు మీద కారం చల్లినట్లుగా మారింది.
తాజాగా శనివారం రాత్రి జేఎన్టీయూలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘‘ఉద్యోగాల కోసం దీక్ష చేస్తున్న ముగ్గురిలో ఏ ఒక్కరూ పరీక్ష రాయడం లేదు. ఏ పరీక్షరాయనోళ్లు, ఏ ఉద్యోగానికి పోటీపడనోళ్లు పరీక్షల వాయిదా కోసం దీక్ష చేస్తున్నరు. ఓ కోచింగ్ సెంటర్ యాజమానే నిరాహార దీక్షకు దిగిండు. ఆయన హాల్‌టికెట్ తీయుండ్రని అధికారులను అడిగితే ఆయనకో కోచింగ్ సెంటర్ ఉన్నది. రెండు నెలలు డీఎస్సీ వాయిదా వేస్తే వందల కోట్ల లాభం వస్తుండె.. 2 నెలల్లో కోట్ల ఆదాయం దెబ్బతీశారన్న అక్కసుతోనే దీక్షచేస్తున్నడని చెప్పిండ్రు. ఇంకొకాయన మొన్నటిదాక మన పార్టీలోనే ఉన్నాడు కదా? పార్టీలో పదవులేం ఇవ్వకపోవడం వల్ల దీక్షకు కూర్చున్నడని తెలిసింది. ఇంకో పిలగాడు దీక్షల కూర్చుండి గాంధీ దవాఖాన్ల చేరిండు. నాకు తెలిసిన వ్యక్తే కాబట్టి ఏం పరీక్షరాస్తుండు.. మంచి కోచింగ్ ఇప్పిద్దామని ఆరా తీస్తే ఓ లీడర్ దీక్షచేస్తే బాగా పేరొస్తదని చెబితే దీక్షల కూర్చున్నడట’’ అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు అర్ధరాత్రి నిరుద్యోగుల ఆందోళనలకు దారి తీశాయి.
అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాలలో నిరుద్యోగులు రహదారుల మీదకు వచ్చి రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ కూర్చోవడంతో తెల్లవార్లు ఆ ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకే తాము డీఎస్సీ వాయిదా, గ్రూప్ 1,2,3 ఉద్యోగాల సంఖ్య పెంచడం గురించి డిమాండ్ చేస్తున్నామని, మా వెనక ఏ రాజకీయ పక్షాలు లేవని నిరుద్యోగులు అంటున్నారు. మరి అప్పట్లో ఏ పరీక్ష కోసం రేవంత్ పీసీసీ అధ్యక్షుడుగా మౌనదీక్ష చేశాడని, రాహుల్ గాంధీని నిరుద్యోగుల వద్దకు తీసుకువచ్చాడని వారు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ మాట తీరు అనవసరంగా నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా ఉందని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.