చంద్రబాబు మోడీ బంధం పైన రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..!

మోడీ రాజకీయ బాహుబలి అయితే ప్రతీ చోటా పొత్తులు ఎందుకు అని ప్రశ్నించారు

Update: 2024-03-09 17:46 GMT

ఏపీలో బీజేపీ టీడీపీల మధ్య పొత్తు ఇలా పొడిచిందో లేదో అలా విమర్శలు వస్తున్నాయి. ఏపీకి చెందిన అధికార వైసీపీ సహా వామపక్షాలు అటు చంద్రబాబుని ఘాటుగా విమర్శిస్తూంటే తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి బాబుని ఏమీ అనలేదు కానీ మోడీ మీదనే తన విమర్శలను ఎక్కుపెట్టారు. మోడీ రాజకీయ బాహుబలి అయితే ప్రతీ చోటా పొత్తులు ఎందుకు అని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా ఎంపీ సీట్లను గెలుస్తామని ఒక వైపు చెబుతూ మరో వైపు దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీలతో మోడీ జట్టు కట్టడం ద్వారా ఎన్డీయే అతుకుల బొంత అని తేల్చేశారు అంటూ రేవంత్ కామెంట్స్ చేశారు.

బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజాదరణ ఉంటే ఈ పొత్తులు ఎందుకు అని ఆయన నిలదీశారు. నిన్నటిదాకా తమకు పడని వారిని అక్రమ కేసులు బనాయించిన వారిని కూడా ఈ రోజు వాటేసుకుంటున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు. బీహార్ లో నితీష్ కుమార్ తో మొదలెట్టారని, ఒడిషాలో నవీన్ పట్నాయక్ ఏపీలో చంద్రబాబు కర్నాటకలో దేవేగౌడ, ఉత్తరప్రదేశ్ లో ఆప్నాదళ్, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను చీల్చి మరీ పొత్తులు పెట్టుకున్నారు అని మోడీ వైఖరిని ఎండగట్టారు.

దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని తామే నాలుగు వందలకు పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పి ఇపుడు ఇలా ఎక్కడికక్కడ సీట్ల కోసం ఈ పొత్తుల నాటకం ఎందుకు అని రేవంత్ రెడ్డి బీజేపీని కడిగి పారేశారు. బీజేపీది బలం కానే కాదు అని ఆయన అన్నారు. 2004లో కూడా తామే మళ్లీ అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు చెప్పారని ఆయన గుర్తు చేశారు.

ఆనాడు వాజ్ పేయ్ ప్రధానిగా ఉండగా ఇండియా షైనింగ్ అని నినాదాలు అందంగా ఇచ్చారని చివరికి ఏమైందని రేవంత్ ప్రశించారు. 2004, 2009లలో వరసగా పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉందని, సోనియా గాంధీ కాంగ్రెస్ ని అలా పవర్ లోకి తెచ్చారని గుర్తు చేశారు.

ఇపుడు కూడా దేశంలో అదే జరగబోతోందని 2024 లో ఇండియా కూటమి కాంగ్రెస్ నాయకత్వంలో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితం తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ని ఎలా ఓడించారో ఇపుడు ఢిల్లీలో మోడీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అది బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలని అన్నారు.

మొత్తం మీద చూస్తే రేవంత్ రెడ్డి అసలు చంద్రబాబుని ఒక్క మాట అనకపోవడం చిత్రం. ఏపీలో పొత్తుల విషయంలో బాబు ఆరాటమే అందరికీ కనిపించింది. మిగిలిన చోట్ల ఎలా ఉన్నా ఏపీ వరకూ చూస్తే బాబు పవన్ బీజేపీ పొత్తుల కోసం ఢిల్లీ వెళ్ళి మూడు రోజుల పాటు అక్కడ ఉండి మరీ కుదుర్చుకున్నారు అన్నది దేశమంతా చూసింది.

మరి రేవంత్ రెడ్డి మోడీదే తప్పు అన్నట్లుగా మాట్లాడడంతో దీని భావమేంటి అని ఆలోచిస్తున్నారు. రేపటి రోజున ఏపీలో ఎన్నికల ప్రచారానికి రేవంత్ వచ్చినా మోడీని జగన్ ని విమర్శించి బాబుని వదిలేస్తారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

Tags:    

Similar News