సుప్రీం తీర్పు.. వర్గీకరణకు సిద్ధం.. ఉద్యోగ నోటిఫికేషన్లనూ సవరిస్తాం.. రేవంత్
సరిగ్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు రావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు
సరిగ్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు రావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అంతేగాక మరో కీలక ప్రకటననూ ఆయన చేశారు. తెలంగాణలో ఇప్పుడు అమలులో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్ లలో కూడా మాదిగ, మాదిగ ఉప కులాలకు రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని వివరించారు. ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని తెలిపారు.
అసెంబ్లీలో పోరాడాం..
మాదిగ, ఎస్సీ ఉప కులాలకు వర్గీకరణకు గతంలో వాయిదా తీర్మానం ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అలంపూర్ అప్పటి ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను సస్పెండ్ చేసిందని సీఎం రేవంత్ విమర్శించారు. ఇక తమ ప్రభుత్వం వచ్చాక 2023 డిసెంబర్ 23న ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహలు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు అడ్వొకేట్ జనరల్ ను పంపించారని పేర్కొన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు లో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించామన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందని చెప్పుకొచ్చారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నామని సీం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ వర్గీకరణ కథ..
ఎస్సీ, ఎస్టీల్లో రిజర్వేషన్ల ఫలాలు అందరికీ సమానంగా అందడం లేదనే వాదనతో వర్గీకరణ డిమాండ్ మొదలైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఏపీలో ఎస్సీ జనాభా 1,38,78,078. వీరిలో మాదిగలు 67 లక్షలు. మాలలు 55 లక్షలు. ఈ ప్రకారం మాదిగలు 12 లక్షలు ఎక్కువ. కానీ, తమకు రిజర్వేషన్ ఫలాలు జనాభా ప్రకారం అందడం లేదనేది మాదిగల వాదన. మరోవైపు 30 ఏళ్ల కిందట మంద క్రిష్ణ మాదిగ సారథ్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) మొదలైంది. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉండగా వర్గీకరణ చేపట్టారు. అయితే, వైఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సుప్రీం కోర్టు దీనిని కొట్టివేసింది. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంది. అదే న్యాయస్థానం సరిగ్గా 20 ఏళ్ల అనంతరం సంచలన తీర్పు ఇచ్చింది. అయితే, అప్పటి ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయింది. చంద్రబాబు విభజిత ఏపీకి సీఎంగా ఉండగా సుప్రీం తీర్పు రావడం గమనార్హం.