రేవంత్ ఏమిటీ స్లో.. వేగంగా నిర్ణయాలు తీసుకోరేం?

ఇందుకు తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొన్ని విద్యార్థి సంఘాల పేరుతో నిర్వహిస్తున్న ధర్నాలు.. ఆందోళనల్ని ప్రస్తావిస్తున్నారు

Update: 2024-07-11 07:30 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తల్లో మెరుపుల్ని సృష్టించిన రేవంత రెడ్డి.. గడిచిన కొంతకాలంగా నెమ్మదించారా? వేగంగా ఒకటి తర్వాత ఒకటి చొప్పున నిర్ణయాలు తీసుకోవటంలో తనదైన మార్క్ ను ప్రదర్శించిన ఆయన ఇటీవల కాలంలో కొన్ని సీరియస్ అంశాలకు స్పందిస్తున్న తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. బహిరంగ సభల్లో రాజకీయ ప్రత్యర్థులకు ఘాటు కౌంటర్లు ఇవ్వటం వరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలకు అవసరమైన వేగాన్ని ప్రదర్శించటం లేదంటున్నారు.

ఇందుకు తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొన్ని విద్యార్థి సంఘాల పేరుతో నిర్వహిస్తున్న ధర్నాలు.. ఆందోళనల్ని ప్రస్తావిస్తున్నారు. డీఎస్పీ నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై విద్యార్థి సంఘాలు కొన్ని నిరసన వ్యక్తం చేస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ విషయంలో పక్కా కార్యాచరణను ఎన్నికల వేళలో ప్రకటించిన కాంగ్రెస్.. దానికి కట్టుబడి ఉన్నానన్న విషయాన్ని నిరుద్యోగులకు అర్థమయ్యేలా వ్యవహరించటం ప్రభుత్వ బాధ్యతగా చెప్పాలి.

ప్రజా ప్రభుత్వంగా తమను తాము అభివర్ణించుకున్న ముఖ్యమంత్రి.. అందుకు తగ్గట్లే నిరసనలు చేసే వారికి అవకాశం ఇవ్వకుండా వేగవంతమైన నిర్ణయాల్ని తీసుకుంటే సరిపోతుంది. డీఎస్సీ నోటిఫికేషన్ విషయంలో లక్షలాది మంది నిరుద్యోగుల ఆకాంక్షలకు తగ్గట్లే తమ ప్రభుత్వ విధానాలు ఉంటాయన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. ఫలానా సమయానికి సదరు నోటిఫికేషన్ వస్తుందన్న విషయాన్ని ప్రకటిస్తే సరిపోతుంది.కానీ.. అలాంటిదేమీ లేకుండా ఆందోళనలకు అవకాశం ఇవ్వటం.. నిరుద్యోగుల పేరుతో కొందరు చేస్తున్న నిరసనల వెనుక రాజకీయ ప్రేరితంగా విమర్శిస్తే సరిపోదన్న విషయాన్ని సీఎం రేవంత్ అర్థం చేసుకోవాలంటున్నారు.

ఎందుకంటే.. కేసీఆర్ సర్కారు ఎన్నికల్లో ఓడిపోవటానికి ఉన్న ప్రధాన కారణాల్లో ముఖ్యమైంది నిరుద్యోగ సమస్య. అలాంటి సమస్యకు సంబంధించి ఉన్న సంశయాల్ని తీర్చాల్సిన అవసరం రేవంత్ మీద ఉంది. అవసరమైతే నాలుగైదు నెలల తర్వాత అయినా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందన్న విషయాన్ని ప్రకటిస్తే సరిపోతుంది కదా? అన్నది ప్రశ్నగా మారింది. పాలనలో జెట్ స్పీడ్ తో నిర్ణయాలు తీసుకోవాల్సిన వేళ.. అందుకు భిన్నంగా నెమ్మదిని ప్రదర్శిస్తే ఫెయిల్ అయ్యారన్న ఇమేజ్ ను సొంతం చేసుకోవాల్సి ఉంటుందన్నది సీఎం రేవంత్ వెంటనే గుర్తించాలి. తమ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంలో భాగమైన భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ అంశానికి ప్రాధాన్యత ఇస్తే.. రేవంత్ ప్రభుత్వానికి ఎదురవుతున్న డ్యామేజ్ తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News