కొత్త సీన్.. రేవంత్ సర్కారు సరికొత్తగా ఉందట!
ఎప్పుడు ఏ సబ్జెక్టు చర్చకు వచ్చేదన్నది కేసీఆర్ మూడ్ మీద ఆధారపడి ఉండేదన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్లు గులాబీ బాస్ కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసిన వారందరికి తాజాగా వచ్చిన మార్పులో భాగంగా రేవంత్ రెడ్డి సర్కారు కొలువు తీరటం తెలిసిందే. గతానికి వర్తమానానికి మధ్యనున్న తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. గతంలో వన్ మ్యాన్ షో ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నమైన ముచ్చట కనిపిస్తోంద. గతంలో ప్రభుత్వ విభాగాలను రివ్యూ చేసే విషయంలో కేసీఆర్ అనూహ్య రీతిలో వ్యవహరించేవారు. ఒక క్రమపద్దతి అన్నది పాటించకుండా తనకు నచ్చిన అంశంపై గంటల కొద్దీ రివ్యూ సాగేది.
ఎప్పుడు ఏ సబ్జెక్టు చర్చకు వచ్చేదన్నది కేసీఆర్ మూడ్ మీద ఆధారపడి ఉండేదన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. రేవంత్ సర్కారులో మాత్రం అందుకు భిన్నంగా ఒక ఆర్డర్ ప్రకారం.. ఒక్కో శాఖను రివ్యూ చేసుకుంటూ పోతున్నారు. అంతేకాదు.. రివ్యూ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. మిగిలిన మంత్రులు ఇద్దరు ముగ్గురుతో పాటు.. సీఎస్ కూడా ఒకే వరుసలో ఉంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరిగా రివ్యూ జరిగేది. ఆయనకు కాస్తంత వెనకగా కూర్చునేవారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. అందరూ సమ ప్రాధాన్యతతో ఉన్నట్లుగా ఒకే వరుసలో ఉండి.. రివ్యూ చేస్తున్న వైనం చూస్తే..కొత్త సీన్ ఆవిష్క్రతమైనట్లుగా చెప్పాలి.
అందేకాదు.. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోనే కేసీఆర్ సర్కారుకు.. రేవంత్ సర్కారుకు మధ్య తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. సీఎం ఛాంబర్ వద్దకు ఎవరిని అనుమతించేవారు కాదు. అధికార పార్టీలో కీలకంగా ఉన్న వారు.. అతి ముఖ్యమైన వారికి సైతం ఎంట్రీ ఉండేది కాదని గర్తు చేసుకుంటున్నారు.
అదే సమయంలో రేవంత్ అధికారంలోకి వచ్చి రాగానే.. అందరికి అందుబాటులో ఉండేలా వ్యవమరించటమే కాదు.. అసెంబ్లీసమావేశాల వేళ.. సీఎం ఛాంబర్ వద్దకు వచ్చేలా అనుమతులు ఇవ్వటం ఆసక్తికరంగామారింది. మొత్తంగా కొత్త సర్కారుకు.. కేసీఆర్ సర్కారుకు ఏ మాత్రం పొసగని రీతిలో ఉందంటున్నారు. ఏమైనా.. కొత్త ప్రభుత్వం కారణంగా మారిన సీన్ మాత్రం అందరిని ఆకర్షిస్తుండటం గమనార్హం. మరక మంచిదే అన్న వాణిజ్య ప్రకటనకు తగ్గట్లే.. మార్పు కూడా మంచిదే అన్న మాట వినిపిస్తోంది.