ప్రభుత్వాన్ని ఎవడ్రా కూల్చేది.. పళ్లు రాలగొడతామన్న రేవంత్

కేటీఆర్ కు తోడుగా మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు మరికొందరు గులాబీ నేతలు విమర్శలు చేస్తున్న వేళ.. తాజాగా జరిగిన ఒక బహిరంగ సభలో తీవ్రస్వరంతో హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్.

Update: 2024-02-03 05:28 GMT

డైలీ బేసిస్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ పదే పదే విమర్శలు చేయటం.. పలు ఘాటు వ్యాఖ్యలు చేస్తుండటం తెలిసిందే. కేటీఆర్ కు తోడుగా మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు మరికొందరు గులాబీ నేతలు విమర్శలు చేస్తున్న వేళ.. తాజాగా జరిగిన ఒక బహిరంగ సభలో తీవ్రస్వరంతో హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్. మూడునెలలకో.. ఆర్నెల్లకో ప్రభుత్వం పడిపోతుందని.. మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారంటూ ఎవరైనా అంటే పళ్లు రాలగొడతామన్న ఆయన.. ‘‘ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేది?’’ అంటూ సీరియస్ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదని.. అప్పుడే శాపనార్థాలు పెడుతున్నారని.. మరి పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు మీరు? అని ప్రశ్నించారు. ‘‘ఎంతసేపు మీ బిడ్డలు.. మీ ఫామ్ హౌజ్ లు తప్పించి.. రాష్ట్రంలోని బిడ్డల కోసం ఆలోచించావా? కవిత ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ ఉద్యోగాన్ని ఇచ్చారు. మరి స్టాఫ్ నర్సులు.. కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఇచ్చావా? బిల్లా రంగాలు (కేటీఆర్.. హరీశ్ లను ఉద్దేశించి) ఎంత శాపనార్థాలు పెట్టినా పదిహేను రోజుల్లో 15వేల కానిస్టేబుల్ ఉద్యోగాల్ని భర్తీ చేసే బాధ్యత మాదే. చెరుకు పంటలో అడవి పందులు ఏ విధంగా దాడి చేస్తాయో అదే విధంగా తెలంగాణపై కేసీఆర్ కుటుంబం దాడి చేసి విధ్వంసం చేశారు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబాలో పలు డెవలప్ మెంట్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి.. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబాన్ని ఆయన ఒక రేంజ్లో టార్గెట్ చేశారు. తనపై రోజువారీగా చేసే విమర్శలకు ఒక్క సభలో వాటన్నింటికి సమాధానమిచ్చారు. ‘‘కేసీఆర్ ను నేరుగా అడుగుతున్నా. ఎప్పుడైనా అదిలాబాద్ జిల్లా ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచించారా? నిజంగా డెవలప్ మెంట్ చేస్తే నీళ్ల కోసం, నాగోబా గుడి కోసం, రోడ్ల కోసం నిధులు మేం ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు ఉంటుంది?’’ అంటూ లాజిక్ గా ప్రశ్నించారు.

కోటి ఎకరాలకు నీళ్లు అన్న కేసీఆర్ కు సవాల్ విసిరారు సీఎం రేవంత్. కోటి ఎకరాలకు నీళ్లు అన్న కేసీఆర్ వస్తే.. అదిలాబాద్ ను చూపిస్తామని.. కావాలంటే హెలికాఫ్టర్ పెడతామన్న రేవంత్.. ‘‘ఎక్కడ నీళ్లు ఇచ్చావో చూపించు. త్వరలోనే తెలంగాణ మహిళలకు రూ.500లకు సిలిండర్ గ్యాస్ అందించే పథకాన్ని త్వరలోనే అమలు చేస్తాం. 200 యూనిట్ల ఉచిత కరెంట్ త్వరలోనే అమలు చేస్తాం. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆరేడు ఎంపీ సీట్లు వస్తాయని కేసీఆర్ అంటున్నారు. ఆ సీట్లు వస్తే మోడీకి అమ్ముకుందామనా? దేశంలో ఉన్నవి రెండే కూటములు. ఒకటి మోడీ కూటమి. రెండోది ఇండియా కూటమి. కేసీఆర్ ను ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమిలోకి రానివ్వం. ఆ ఇంటి పిట్టను ఈ ఇంటి మీద వాలితే కాల్చి పారేస్తాం. మోడీ కేడీ (కేసీఆర్)లు ఇద్దరు కలిసి కాంగ్రెస్ ను అడ్డుకోవాలనుకుంటున్నారు. అదిలాబాద్ ప్రజలు గెలిపించిన సోయంబాపూరావుకు కనీసం మంత్రి పదవి ఇచ్చారా?’’ అంటూ ప్రశ్నించారు.


Tags:    

Similar News