కేసీఆర్ కోసం గట్టిగా ప్రిపేర్ అవుతున్న రేవంత్... తెరపైకి కీలక విషయం!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాజాగా ఈ నెల 14న ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో సరికొత్త దృశ్యం ఆవిషృతం కాబోతుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాజాగా ఈ నెల 14న ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో సరికొత్త దృశ్యం ఆవిషృతం కాబోతుంది. రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ అధికారంలోనే ఉన్న బీఆరెస్స్ నేతలు.. ఇకపై ఫస్ట్ టైం ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నారు. ఇక దశాబ్ధ కాలంగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డి గట్టిగా ప్రిపేర్ అవుతున్నారని తెలుస్తుంది.
అవును... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచీ అధికారంలో ఉన్న బీఆరెస్స్ పాలనలో ఏయే శాఖల్లో పరిస్థితి ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి ఇంకెలా ఉంది మొదలైన విషయాలపై అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వాన్ని కడిగిపారేస్తూ.. ప్రజలకు స్పష్టమైన వివరణ ఇచ్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రిపేర్ అవుతున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేయిస్తున్నారని సమాచారం.
ఏపీ అసెంబ్లీలో గత ప్రభుత్వ పనితీరు, నాటి ముఖ్యమంత్రి చేసిన కార్యక్రమాలు, అందులో జరిగిన అవకతవకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలూ ప్రదర్శిస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్... ప్రతిపక్షాన్ని కార్నర్ చేసిన సంగతి తెలిసిందే. వాదించడానికి, కవర్ చేసుకోవడానికి ప్రతిపక్ష సభ్యులకు అవకాశం లేకుండా... లైవ్ ఇచ్చినంత పనిచేశారు! పలు వీడియో బైట్లను, జీవోలను ప్రజలకు చూపించారు.
ఈ సమయంలో తెలంగాణలో కూడా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ డిజిటల్ వాయింపే లక్ష్యంగా రేవంత్ రెడ్డి కూడా సిద్ధపడుతున్నారని, ఆ దిశగా ప్రణాళికలు రచిస్తున్నారని అంటున్నారు. దీంతో ఈసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరింత రసవత్తరంగా ఉండబోతున్నాయని అంటున్నారు పరిశీలకులు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రధానంగా విద్యుత్ శాఖ, ధరణి పోర్టల్, ఆర్థిక శాఖ, పరిశ్రమల శాఖ వంటి కీలక శాఖలపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్... ఆయా శాఖల పనితీరును శ్రద్ధగా పర్యవేక్షిస్తున్నారని తెలుస్తుంది! ఇప్పటికే విద్యుత్ శాఖ రూ. 85వేల కోట్ల అప్పుల్లో ఉందనే విషయం బయటకు వచ్చింది. మరోపక్క పౌర సరఫరాల శాఖలోనూ రూ. 65వేల కోట్లు అప్పు ఉందని ఆ శాఖ మంత్రి ఉత్తం తాజాగా వెల్లడించారు.
ఇలా ప్రతీశాఖలోనూ ఆర్థిక పరిస్థితి, ఇతర పరిస్థితి, అవకతవకలు మొదలైన అంశాలన్నింటినీ క్రోడీకరిస్తూ.. సవివరంగా పొందుపరుస్తూ. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ హయాంలో ఆర్థిక దుబారా జరిగిందంటూ దానిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తుంది.
దీంతో... ఈ నెల 14న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను ఇచ్చేందుకు అవసరమైన టెక్నికల్ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో రేవంత్ సీనియర్ అధికారులను ఆదేశించారని తెలుస్తుంది. దీంతో... ఈ దఫా అసెంబ్లీ నియోజకవర్గాల్లు గతంలో ఎన్నడూ లేనట్లుగా సాగే అవకాశం ఉందని అంటున్నారు.
ఇలాంటి కీలక సమయంలో బీఆరెస్స్ అధినేత కేసీఆర్ యశోద ఆస్పత్రిలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పూర్తి బాధ్యత కేటీఅర్, హరీష్ రావు, కడియం శ్రీహరి మొదలైన కీలక నేతలపై పడే అవకాశం ఉందని అంటున్నారు!