ఎయిర్ పోర్టు మెట్రోను ఆపేయాలన్న సీఎం రేవంత్ ఇంకేం చెప్పారు?

గతంలో చేసుకున్న ఒప్పందంలో భాగంగా పాతబస్తీ మెట్రో పనులు చేపట్టకపోవటంపై ఎల్ అండ్ టీ మీద అసంత్రప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని అధికారుల్ని ఆదేశించారు.

Update: 2023-12-14 04:00 GMT

సంచలన నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ ప్రభుత్వం. కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ఎయిర్ పోర్టు మెట్రో ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని.. దాని స్థానంలో పాతబస్తీ మీదుగా వెళ్లే మెట్రో ప్రాజెక్టు మీద ఫోకస్ చేయాలని సూచన చేశారు. అంతేకాదు.. ట్రిపుల్ వన్ (111) జీవో పరిధిలో మెట్రో అలైన్ మెంట్ ఎలా చేస్తరన్న ప్రశ్నను సంధించారు. గతంలో చేసుకున్న ఒప్పందంలో భాగంగా పాతబస్తీ మెట్రో పనులు చేపట్టకపోవటంపై ఎల్ అండ్ టీ మీద అసంత్రప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని అధికారుల్ని ఆదేశించారు.

గత (కేసీఆర్) ప్రభుత్వం రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లేలా మెట్రో రైలు ప్రాజెక్టును ప్రకటించటం తెలిసిందే. అయితే.. తాజాగా రివ్యూ సందర్భంగా రేవంత్ వాదన వేరేగా ఉంది. ఇప్పటికే అవుటర్ రింగు రోడ్డు లాంటి చక్కటి ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉన్నప్పుడు.. మళ్లీ మెట్రో సౌకర్యం ఎందుకు? అనన్నది ఆయన ప్రశ్న. దానికి బదులుగా.. సెంట్రల్ హైదరాబాద్ తో పాటు ఈస్ట్ హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లేలా మెట్రో ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను ఆయన తెర మీదకు తీసుకొచ్చారు.

అంతేకాదు.. ఎల్ అండ్ టీ మెట్రో రైలు.. జీఎంఆర్ ఎయిర్ పోర్టు రాయితీ ఒప్పందాల్ని పరిశీలించాలని.. మూసీ వెంట రోడ్ కం మెట్రో కనెక్టివిటీ పెంచేలా ప్రణాళికను తయారు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైలు డెవలప్ మెంట్.. ఇతర అంశాలపై సీఎం జరిపిన సమీక్ష అద్యంతం సంచలనంగా మారింది. నగర అభివ్రద్ధి మొత్తం ఒకవైపు కాకుండా.. సమతుల్యత ఉండేలా చేపట్టాలన్న సూచన చేసిన ముఖ్యమంత్రి రేవంత్.. హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో రైలు టెండర్లను నిలిపివేయాలని పేర్కొన్నారు.

ఎంజీబీఎస్.. ఫలక్ నుమా.. ఎల్బీ నగర్.. చాంద్రాయణగుట్టల నుంచి ఎయిర్ పోర్టుకు మెట్రో లైన్ ఉండే అవకాశాలకు సంబంధించిన ప్రజంటేషన్ ను తయారు చేయాలని కోరిన రేవంత్.. హైదరాబాద్ కు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచన చేశారు. మొత్తంగా చూస్తే.. రేవంత్ తాజా సమీక్ష పుణ్యమా అని.. ఎయిర్ పోర్టు మెట్రో ప్రాజెక్టు అటక మీదకు ఎక్కినట్లేనని చెప్పాలి. నిజానికి.. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో భాగంగా.. గ్రౌండ్ వర్కు పూర్తి కావటమే కాదు.. పేపర్ మీద పనులు దాదాపుగాపూర్తి అయిన పరిస్థితి. సరిగ్గా.. టెండర్ల దశలో ఉన్న ప్రాజెక్టును నిలిపివేయాలన్న ఆదేశంతో పాటు.. తన విజన్ ను వెల్లడించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News