కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చెయ్... కేసీఆర్ ధమ్ముకు రేవంత్ ఛాలెంజ్!
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రసవత్తర రాజకీయ తెరపైకి వచ్చింది.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రసవత్తర రాజకీయ తెరపైకి వచ్చింది. ప్రధానంగా బీఆరెస్స్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ క్రమంలో గురువారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు.. శుక్రవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి రియాక్షన్ వచ్చేసింది.. అది కూడా స్ట్రాంగ్ గా కావడం గమనార్హం!
అవును... తెలంగాణ భవన్ లో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన కేసీఆర్... బీఆరెస్స్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వాళ్లు బాధపడుతున్నారని.. కాంగ్రెస్ లోనూ అంతా బీజేపీ కథే నడుస్తోందంటూ ఆ పార్టీలోకి వెళ్లిన ఓ సీనియర్ నేత వాపోయారన్నారని తెలిపారు. ఇదే క్రమంలో... 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రమ్మంటారా అని సీనియర్ నేత ఒకరు తనతో అన్నారని.. అయితే వద్దని తానే చెప్పానని కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ సమయంలో తాజాగా కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డికి మద్దతుగా పాలమూరులో ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్న సందర్భంగా రేవంత్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... కారు వర్క్ షాపు నుండి ఇంటికి రాదని.. తుక్కుకు అమ్మాల్సిందేనని ఎద్దేవా చేశారు. 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారని.. చిటిక కొడితే వారంతా వస్తారన్నట్లు మాట్లాడుతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా చిటిక కాదు.. మిద్దెనెక్కి దమ్ముకొట్టినా ఏ ఒక్కరూ రారని చెప్పిన రేవంత్… “గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మందా.. తోడేల్ల లాగా వచ్చి కొట్టుకుపోదామని అనుకుంటున్నారేమో.. ఇక్కడ కాపాలా ఉన్నది రేవంత్ రెడ్డి.. ప్రయత్నించి చూడు.. ఇక్కడ కంచెగా ఉన్న హైటెన్షన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి.. ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా కేసీఆర్ పరిస్థితి మారిపోతుంది” అంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే క్రమంలో... పాలమూరులో అనేక ప్రాజెక్టులు చేపట్టామని చెప్పిన రేవంత్.. పదేళ్లుగా ఈ జిల్లాను ఎడారిగా మార్చారని దుబ్బయట్టారు. ఇదే సమయంలో... పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా? పార్లమెంటులో నిద్రపోవడానికా బీఆరెస్స్ కు ఓటు వేయాలి? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.