రేవంత్ చంద్రబాబును కలుస్తారా..? చంద్రబాబు రేవంత్ ను కలుస్తారా?

తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి సరే.. ఇద్దరు సీఎంలు తొలినాళ్లలో హైదరాబాద్ లోనే ఉండేవారు సరే.. కానీ, ఒక్క ఉదంతంతో ఎక్కడివారు అక్కడికి పరిమితం అయ్యారు.

Update: 2023-12-06 10:35 GMT

తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రాబోయే ఆరు నెలల్లో మాంచి రసకందాయంలో పడనున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ విషయంలో ఎలా వ్యవహరిస్తారు? అక్కడి ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారు..? తనకు రాజకీయంగా గట్టి పునాది వేసిన చంద్రబాబును ఏవిధంగా చూస్తారు? అనేది ఇందులో కీలకం. రెండు రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరిగితే ఈ గొడవ ఉండేది కాదేమో.?. కానీ, తెలంగాణలో గత ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. దీంతో ఆరు నెలల ముందుగానే తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి.

ఆ ఉదంతం.. ఓ కుదుపు

తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి సరే.. ఇద్దరు సీఎంలు తొలినాళ్లలో హైదరాబాద్ లోనే ఉండేవారు సరే.. కానీ, ఒక్క ఉదంతంతో ఎక్కడివారు అక్కడికి పరిమితం అయ్యారు. ఆ సంఘటనే ఓటుకు నోటు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నామినేటెడ్ ఎమ్మెల్సీని కొనేందుకు ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు రావడం.. ఏపీ అప్పటి సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సూత్రధారిగా.. రేవంత్ రెడ్డి పాత్రధారిగా ఇదంతా సాగిందంటూ నాటి కేసీఆర్ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం.. ఆపై చంద్రబాబు ఏపీకి పరిమితం కావడం అందరికీ తెలిసిన సంగతే. ఇక 2018 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కాంగ్రెస్-వామపక్షాలతో కలిసి మహా కూటమి కట్టడం కేసీఆర్ కు కోపం తెప్పించింది. ఆ తర్వాత ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా కేసీఆర్ వ్యవహరించారని చెబుతారు.

ఎన్నాళ్లకో కలయిక..?

రేవంత్ 2017 అక్టోబరులో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఆ సమయంలో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు దగ్గరకు వెళ్లి తాను పార్టీని వీడితున్నట్లు మర్యాదపూర్వకంగా చెప్పి వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. 2018 ఎన్నికల సందర్భంగా తప్ప, రేవంత్ మరోసారి చంద్రబాబును కలిసినట్టు, భేటీ అయినట్లు వార్తలు రాలేదు. కాగా, గురువారం తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు వస్తారా? అనేది చూడాలి.

మర్యాదపూర్వంగా కలుస్తారా?

చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి దాదాపు రెండు నెలలు జైలులో ఉన్నారు. బెయిల్ పై బయటకు వచ్చాక రాజకీయ అంశాలపై మాట్లాడడం లేదు. పుణ్య క్షేత్రాలను సందర్శిస్తూ వస్తున్నారు. బెయిల్ మంజూరు అనంతరం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసానికి వచ్చారు. ఆ తర్వాత ఏపి, ఢిల్లీ వెళ్లారు. మరోసారి ఇప్పుడు హైదరాబాద్ వస్తే.. రేవంత్ ప్రమాణానికే అయి ఉండాలి. పనిలోపనిగా కాస్త విరామం-విశ్రాంతి తీసుకునేందుకు వచ్చే చాన్సుంది. ఈ సందర్భంలోనే రేవంత్ ఆయనను కలుస్తారా? లేక చంద్రబాబే నేరుగా సీఎం అయ్యాక రేవంత్ ను కలుస్తారా? అన్నది ప్రశ్న. ఈ రెండింటిలో ఏది జరిగినా.. అది రాజకీయంగా ప్రాధాన్య అంశమే.

Tags:    

Similar News