ఆర్థిక మూలాలపైనా కన్ను అదే జరిగితే జగన్‌కు నష్టమే!
రాజకీయ నేతలకు ఆర్థిక సాయం చేస్తున్న కంపెనీలను కూడా ఆయన కట్టడి చేశారు.
రాజకీయాల్లో జాలి-దయ అనేది ఎవరికీ ఉండదు. నిన్న ఉన్నట్టుగా రేపటి రాజకీయాలు కూడా ఉండవు. కాబట్టి.. ఎక్కడ ఎలాంటి అవకాశం వస్తే.. అలా వ్యవహరించడం అనేది రాజకీయాల్లో ఎవరైనా చేసేదే. ఇది దేశవ్యాప్తంగా అన్ని చోట్లా కామన్‌గా మారింది. తనను వ్యతిరేకించేవారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడంలో ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పంథాను అనుసరించిన విషయం తెలిసిందే. ఒకవైపు రాజకీయ నేతలపై ఈడీ, సీబీఐలను పంపిస్తూ.. దాడులు చేయిస్తూ.. వారి ఆర్థిక వ్యవహారాలను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయితే.. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.
మరో కోణంపైనా ప్రధాని మోడీ అప్పట్లో కన్నేశారు. రాజకీయ నేతలకు ఆర్థిక సాయం చేస్తున్న కంపెనీలను కూడా ఆయన కట్టడి చేశారు. వాటిపై కూడా ఐటీ దాడులు చేయించారు. ఫలితంగా ఆయా కంపెనీలు.. సదరు నేతలకు నిధులు ఇవ్వడం, విరాళాలు ఇవ్వడం ఆపేశాయి. కట్ చేస్తే.. ఇప్పుడు ఏపీలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ఎందుకంటే.. రాజకీయంగా చూసుకున్నప్పుడు.. ప్రజలు వైసీపీని దూరం పెట్టారు. ఇక, వైసీపీ గతంలో చేసిన దాడులు.. తమపై పెట్టిన కేసుల నేపథ్యంలో టీడీపీ కూడా అంతే స్థాయిలో రాజకీయంగా వ్యూహాలు వేయాలని నిర్ణయించింది.
దీనిలో భాగంగానే రాజకీయంగా ఎలానూ తమ చేతికి మట్టి అంటకుండా.. ప్రజలే వైసీపీని పక్కన పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఆర్థికంగా వైసీపీని అణిచేయాలన్న విధంగా ముందుకు సాగుతోంది. తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1) జగన్ మీడియాకు ఇచ్చిన రూ.400 పైచిలుకు కోట్ల రూపాయల వ్యవహారంపై విచారణ చేయించడం. దీనిని అవసరమైతే.. సభా సంఘానికి అప్పగించి.. లోతైన విచారణ చేసి.. సదరు నిధుల్లో న్యాయ బద్ధమైనవి వదిలేసి.. అక్రమంగా పంచేసిన సొమ్మును వెనక్కి తీసుకోవాలన్నది సర్కారు వ్యూహం.
2) ప్రభుత్వ పరంగా.. సలహాదారులకు కట్టబెట్టిన సౌకర్యాలు, కార్ల కొనుగోలు, వారి జీత భత్యాలు వంటి వాటిపై సమీక్ష చేసి.. ఆయా మొత్తాలను కూడా వెనక్కి రప్పించడం. దీనిని సభలోనే ప్రతిపాదించారు. అలానే.. గనుల వ్యవహారంలో సాగిన రివర్స్ టెండర్లను కూడా.. సమీక్షించడం. ఎక్కడెక్కడ ఏ నాయకుడు ఇసుక, గనుల్లో వేలు పెట్టారో తెలుసుకుని.. వారిపైనా చర్యలు తీసుకోవడం.. ఆ నిధులు వెనక్కి రప్పించడం. ఇవన్నీ కూడా.. అసెంబ్లీ వేదికగా తీసుకున్న నిర్ణయాలే కావడం గమనార్హం. ఈ పరిణామాల ద్వారా.. వైసీపీ నాయకులు అడ్డంగా బుక్కవడమో.. లేక రాజకీయాలు వదులుకుని శరణుజొచ్చడమో చేస్తారనేది టీడీపీ వర్గాల మాట. ఏది ఎలా ఉన్నా.. ఆర్థికంగా మాత్రం వైసీపీకి చిక్కే!!