హోటల్ తగులబెట్టి.. అగ్నిమాపక సిబ్బందికి అడ్డుపెట్టి.. 24 మంది సజీవదహనం!
తాజాగా జషోర్ జిల్లాలో అవామీ లీగ్ పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి షాహీన్ చక్లాధర్ కు చెందిన ఓ హోటల్ లో దారుణం చోటు చేసుకుంది.
బంగ్లాదేశ లో కల్లోలం కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లిన తర్వాత కూడా మరణాలు ఆగడం లేదని అంటున్నారు. సైనిక పాలనకు ఈ అల్లర్లను ఆపడం సాధ్యం కావడం లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ సమయంలో తాజాగా ఓ హోటల్ కు అల్లరి మూకలు నిప్పు పెట్టాయి.
అవును... రిజర్వేషన్స్ పేరు చెప్పి విద్యార్థి సంఘలు చేస్తున్న ఆందోళనలతో బంగ్లాదేశం అట్టుడుకుతోంది. ఓ పక్క షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయినా.. సైనిక పాలన కొనసాగుతున్నా అక్కడ మాత్రం హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జషోర్ జిల్లాలో అవామీ లీగ్ పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి షాహీన్ చక్లాధర్ కు చెందిన ఓ హోటల్ లో దారుణం చోటు చేసుకుంది.
ఈ జబీర్ ఇంటర్నేషనల్ హోటల్ లు అల్లరిమూకలు నిప్పు పెట్టాయి. దీంతో... ఆ హోటలో ఉన్న 24 మంది సజీవ దహనమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇందులో ఒకరు ఇండోనేషియా పౌరుడు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో... గత మూడు వారాలుగా కొనసాగుతున్న ఈ అల్లర్ల కారణంగా సంభవించిన మరణాల సంఖ్య 440కి చేరుకుంది.
షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లిన కొన్ని గంటల్లోనే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ హోటల్ కు నిప్పు పెట్టిన ఆందోళనకారులు ఫైర్ సిబ్బంది అక్కడకు రాకుండా అడ్డుకున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు సైన్యం శ్రమిస్తోందని అంటున్నారు.
మరోపక్క దేశంలో పరిస్థితి అదుపులోకి వచ్చే సూచనలు ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో హింసాత్మక ఘటనలూ ఆగడం లేదని అంటున్నారు. అయితే పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా మూసివేసిన పాఠశాలలు, ఆఫీసులు, దుకాణాలు తెరుచుకుంటున్నాయని అంటున్నారు. వీలైనంత త్వరలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం శ్రమిస్తుందని చెబుతున్నారు.