మామ ఆరోపణలపై జడేజా భార్య సంచలన వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న జడేజా భార్య రివాబా తన మామ విమర్శలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొద్ది రోజుల క్రితం భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుద్ సిన్హ్ తన కోడలిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన కొడుకు క్రికెటర్ కాకుంటే రివాబా.. జడేజాను పెళ్లే చేసుకునేది కాదని ఆయన ఆరోపించారు. జడేజా సెలబ్రిటీ కాబట్టే ఆ హోదా కోసమే తన కుమారుడిని పెళ్లి చేసుకుందని జడేజా తండ్రి తీవ్ర విమర్శలు చేశారు. పెళ్లి అయ్యాక తనకు, తన కుమారుడి మధ్య చిచ్చుపెట్టిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న జడేజా భార్య రివాబా తన మామ విమర్శలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటేసేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా ఈ ప్రశ్న అడిగిన రిపోర్టర్ పై ఆమె ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
"మీ మామగారు మీపై కొన్ని ఆరోపణలు చేశారు. వాటిపై మీ స్పందనేంటి?" అని విలేకరి రివాబా జడేజాను ప్రశ్నించగా.. "ఇప్పుడు మనం నిర్వహించుకుంటున్న కార్యక్రమం ఏంటి?" అని ఆమె ఎదురుప్రశ్నించారు. "మీరు ఏదైనా తెలుసుకోవాలంటే నేరుగా నన్నే సంప్రదించండి.. ఇక్కడ మాత్రం కాదు" అని ఆ రిపోర్టర్ కు ఘాటుగా రివాబా జవాబు ఇచ్చారు.
కాగా తన తండ్రి అనిరుద్ సిన్హా వ్యాఖ్యలపై జడేజా స్పందిస్తూ.. తన తండ్రి పేర్కొన్న విషయాలన్నీ అబద్ధాలు, అర్థరహితమని కొట్టిపారేశాడు. అది ముందస్తు ప్రణాళికతో రూపొందిన ఇంటర్వ్యూ అని ఆరోపించాడు. తన భార్య ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్న దీనిని తాను ఖండిస్తున్నానని తెలిపాడు. తాను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నాడు. కానీ బహిరంగ వేదికల్లో అవన్నీ వెల్లడించలేను అని స్పష్టం చేశాడు.
కాగా ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్టు ఆడిన జడేజా రెండో టెస్టుకు గాయంతో దూరమయ్యాడు. తాజాగా మూడు, నాలుగు, ఐదు టెస్టులకు కూడా అతడిని భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీలో జడేజా చికిత్స తీసుకుంటున్నాడని సమాచారం.
మరోవైపు రవీంద్ర జడేజా భార్య రివాబా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గుజరాత్ లోని జామ్ నగర్ నార్త్ నుంచి ఆమె గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక ఎన్నికల ప్రచార సమయంలో రవీంద్ర జడేజా తన భార్య రివాబాకు మద్దతుగా నిలవగా... అతడి తండ్రి అనిరుద్ సిన్హా, అక్క నైనాబా కాంగ్రెస్ తరఫున రివాబాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం గమనార్హం.