మర్రిచెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.64 లక్షలు మర్రిచెట్టు తొర్రలో బయటపడ్డాయి.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.64 లక్షలు మర్రిచెట్టు తొర్రలో బయటపడ్డాయి. అసలు ఆ డబ్బులు అక్కడికి ఎలా చేరాయి అని ఆలోచిస్తున్నారా ఏటీఎంలలో నగదు నింపేందుకు బయలుదేరిన సిబ్బంది మధ్యాహ్న భోజనం చేసేందుకు ఓ పెట్రోలు బంకు వద్ద వాహనం ఆపి తినేందుకు లోపలికి వెళ్లగా ముసుగు ధరించిన వ్యక్తి వచ్చి తాళం పగులగొట్టి రూ.64 లక్షల విలువైన 500 నోట్ల కట్టలను ఎత్తుకెళ్లాడు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నుండి సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థకు చెందిన సిబ్బంది రూ.68 లక్షలతో చీమకుర్తి, మర్రిచెట్టుపాలెం, దొడ్డవరం, గుండ్లాపల్లి, మద్దిపాడులలో ఉన్న ఏటీఎంలలో నింపేందుకు బయలుదేరారు. సమయం మధ్యాహ్నం 2 గంటలు అవుతుండడంతో కర్నూలు రహదారిలోని ఇండియన్ పెట్రోలు బంకు వద్ద ఆపి భోజనం చేసేందుకు లోపలికి వెళ్లారు. తిరిగి వచ్చి చూస్తే 100 నోట్ల కట్టలున్న నాలుగు లక్షలను వదిలేసి 500 నోట్ల కట్టలున్న రూ.64 లక్షలు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి క్లూస్ టీంను రంగంలోకి దించారు. గతంలో ఇదే సంస్థలో పనిచేసి ఉద్యోగం వదిలేసిన మహేష్ ముసుగు ధరించి బైక్ మీద వచ్చి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో తన స్వగ్రామమైన సంతనూతలపాడు మండలం కామేపల్లివారిపాలెంలో అతడి ఇంటికి సమీపంలో ఉన్న ఓ మర్రిచెట్టు తొర్రలో నగదు దాచినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు వెంటనే నగదును స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్టు చేశారు. కేవలం గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును చేధించడం పట్ల అభినందనలు వెల్లువెత్తాయి.