జగన్ తప్పేలేదు... టిక్కెట్ల మార్పులపై రోజా ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ సమయంలో చాలామంది ఇన్ ఛార్జ్ లను మార్చడంతోపాటు.. పలువురు సిట్టింగులకు ఈ దఫా టిక్కెట్లు రాకపోవచ్చని కథనాలొస్తున్నాయి.
ప్రస్తుతం అధికార వైసీపీలో ఇన్ ఛార్జ్ ల మార్పు చేర్పుల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఆయా ప్రాంతాల సమన్వయకర్తలు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లతో టచ్ లోకి వెళ్లారని తెలుస్తుంది. ఈ సమయంలో చాలామంది ఇన్ ఛార్జ్ లను మార్చడంతోపాటు.. పలువురు సిట్టింగులకు ఈ దఫా టిక్కెట్లు రాకపోవచ్చని కథనాలొస్తున్నాయి. ఈ సమయంలో మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్ ఛార్జ్ లను మార్చడానికి గల కారణాలను వివరించారు!
అవును... ఇప్పుడు ఏపీలోని అధికార వైసీపీలో ఇన్ ఛార్జ్ ల మార్పులు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కొంతమంది సిట్టింగులకు టిక్కెట్లు గల్లంతవుతున్నాయని చెబుతున్నారు. అదే జరిగితే.. అది పూర్తిగా ఆయా ఎమ్మెల్యేల స్వయంకృతాపరాధమే తప్ప జగన్ తప్పిదం లేదని మంత్రి రోజా స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో కొంతమంది మంత్రులకు స్థాన చలనాలపైనా ఆమె క్లారిటీ ఇచ్చారు.
ఇందులో భాగంగా ఎన్నికలు సమీపించిన సమయంలో స్థానికంగా ప్రజల మన్ననలు పొందిన వారికి.. వారి వారి స్థానాలు పదిలంగా ఉంటాయని తెలిపారు. ఇక మంత్రుల విషయానికొస్తే... వారికి వారి వారి నియోజకవర్గాలతో పాటు పక్కనున్న నియోజకవర్గాల్లో కూడా పట్టు ఉండటంతో.. ఒకవేళ సీటు మార్చినప్పటికీ ఆ రెండు స్థానాలనూ గెలిపించుకునే బాధ్యత వారిపై ఉంటుందని, ఇది సహజమైన విషయం అని ఆమె తెలిపారు.
వాస్తవానికి ఇన్ ఛార్జ్ ల మార్పుకు సంబంధించిన అంశాలకు గల కారణాలను పలు సందర్భాల్లో వైఎస్ జగన్ చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్పారని చెబుతున్న రోజా... తాను ఎవరినీ వదులుకోవడానికి సిద్ధంగా లేనని, తనవరకూ తాను ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్ధానాలనూ నెరవేర్చుతున్నానని, ఇక ఎమ్మెల్యేలుగా మీరంతా స్థానికంగా ప్రజల్లో అసంతృప్తి లేకుండా చూసుకోవాలని, నిత్యం ప్రజల్లో ఉండేలా చూసుకోవాలని చాలా క్లియర్ గా చెప్పారని అన్నారు.
ఈ సమయంలో ఎవరికైనా టిక్కెట్ మిస్ అయ్యిందంటే అది వారి పొరపాటే తప్ప జగన్ పొరపాటు కాదని, ఈ విషయాన్ని అంతా గ్రహించాలని మంత్రి రోజా వెల్లడించారు. ఇదే సమయంలో మరికొంతమంది వారివారు అద్భుతమని ఊహించుకుని, టిక్కెట్లు దక్కుతాయని భ్రమపడి తర్వాత బాధపడితే చేసేదేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. ఇదే సమయంలో అభ్యర్థులతో రెండు మూడు సార్లు చర్చించిన తర్వాతే మార్పులు జరుగుతున్నాయి తప్ప ఒంతెద్దుపోకడలు జరగడం లేదని రోజా స్పష్టం చేశారు.
ఇక సీట్ల మార్పుపై ఎల్లో మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవాలు లేవని.. కేవలం వారి కోరికలు, కడుపుమంటలను కథనాలుగా వండి వడ్డిస్తున్నారని అన్నారు. ఇన్ ఛార్జ్ ల మార్పు విషయాలు అధికారికంగా తెలిసినవే నిజం తప్ప.. ఒక వర్గం మీడియాలో వచ్చే కథనాలు సత్యదూరాలని, వాటిని నమ్మాల్సిన అవసరం లేదని రోజా స్పష్టం చేశారు.