'భాష' మార్చిన ఆర్ఎస్ఎస్.. ప్రతి భాష జాతీయమేనట

ఆర్ఎస్ఎస్ ఎంత చెబితే బీజేపీకి అంత.. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థ ఓ దశలో నిషేధం ఎదుర్కొంది.

Update: 2024-10-12 16:47 GMT

హిందీ జాతీయ భాష.. ఈ మాట అంటే మిగతా రాష్ట్రాల వారు ఎలా స్పందిస్తారో తెలియదు కానీ.. ప్రత్యేకించి తమిళనాడు వాళ్లు మాత్రం తోక తొక్కిన తాచులా లేస్తారు. హిందీ వ్యతిరేక ఉద్యమమే జరిగింది ఆ రాష్ట్రంలో. కొన్నేళ్ల కిందట కూడా హిందీ రగడ చోటుచేసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవాల్సి వచ్చింది. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సైద్ధాంతిక మార్గదర్శి అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాత్రం హిందీ విషయంలో కీలక ప్రకటన చేసింది.

ఆర్ఎస్ఎస్ చెబితే..

ఆర్ఎస్ఎస్ ఎంత చెబితే బీజేపీకి అంత.. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థ ఓ దశలో నిషేధం ఎదుర్కొంది. అయినా మనుగడ సాగిస్తోంది. కాల క్రమంలో బీజేపీ ఏర్పాటు వెనుక కీలక పాత్ర పోషించింది. సంఘ్ నుంచి వచ్చిన నాయకులే బీజేపీలో కీలక స్థానాల్లో ఉంటారనేది అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో దీనికి కొంత సడలింపు ఇచ్చినా.. మౌలికంగా మాత్రం సంఘ్ నేపథ్యమే బీజేపీలో ఎదుగుదలకు ప్రాతిపదిక.

హిందీనే కాదు అన్ని భాషలూ..

స్వాతంత్ర్య ఉద్యమం సహా అనేక సందర్భాల్లో సముచిత పాత్ర ఉన్న హిందీని జాతీయ భాషగా ఏకాభిప్రాయం లేని పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో మాట్లాడే ప్రతి భాష జాతీయ భాషనే అని పేర్కొంది. సంస్థ ఏర్పాటై 100వ ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ.. విజయ దశమి సందర్భంగా మహారాష్ట్ర నాగపూర్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్‌ భగవత్‌, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడణవీస్‌, ఇస్రో మాజీ అధిపతి డాక్టర్ రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో వర్గాల మధ్య ఐక్యత, సామరస్యం కోసం కుల మతాలకు అతీతంగా వ్యక్తుల మధ్య స్నేహం ఉండాలని భగవత్‌ కార్యకర్తలకు సూచించారు. బంగ్లాదేశ్‌ లో హిందూ మైనార్టీలపై దాడులను ఖండించారు. ఉంటున్న ప్రాంతంతో సంబంధం లేకుండా ఐక్యంగా ఉంటే.. ఘర్షణలకు తావుండదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.

ఆర్జీకర్ ఘటన సిగ్గుచేటు

రెండు నెలలుగా దేశాన్ని కుదిపేస్తున్న ఆర్జీకర్ ఆస్పత్రి మహిళా వైద్యురాలి హత్యాచారం ఘటన సమాజానికి సిగ్గుచేటు అని భగవత్ అభివర్ణించారు. ప్రభుత్వాలకు మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. నేరానికి గురైన బాధితురాలికి న్యాయం జరగకపోవడం సమాజాన్ని నిరుత్సాహపరుస్తుందని పేర్కొన్నారు. కాగా, ఆర్ఎస్ఎస్ లో కీలక నాయకుడైన సురేశ్‌ భయ్యాజీ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రాలు వేరు.. వాటి సంస్కృతులు, భాషలు వేర్వేరు. ఒక భాషే గొప్పదనే అనవసర భ్రమను సృష్టిస్తున్నారు. తమిళం, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, హిందీ.. ఇలా భారతీయులు మాట్లాడే ప్రతి భాష.. జాతీయ భాషనే.. భాష వేరయినా.. భారతీయుడిగా మన ఆలోచన ఒకేవిధంగా ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News