సరకూ సరంజామా తో పంచుడుకు వేళాయేరా !

ఎంపీ అభ్యర్ధులకు ఎమ్మెల్యే అభ్యర్ధులకు ప్రధాన రాజకీయ పార్టీలు అనుసంధానం చేశాయి. దాంతో ఎన్నికల ఖర్చుకు ఎంపీల వద్దలు ఆయన అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు క్యూ కడుతున్నారు.

Update: 2024-05-07 00:30 GMT

పూజకు వేళాయెరా అన్న పాట భక్తిగా పాడుకుంటారు అంతా. పంచుడుకు వేళాయెరా అని ఎన్నికల సీజన్ లో అంతే భక్తిగా పాడుకుంటున్నారు. పోలింగ్ కి సరిగ్గా ఆరంటే ఆరు రోజులు సమయం మాత్రమే ఉంది. ఒక్కో నియోజకవర్గంలో రెండు లక్షల మంది కంటే కూడా ఎక్కువగా ఓటర్లు ఉన్నారు.

అందరికీ పంచుడు కార్యక్రమం పూర్తి చేయాలంటే కీలకమైన ఆ వారం రోజులూ సరిపోతాయని అభ్యర్థులు భావిస్తున్నారు. అందుకే మంచి రోజు అని మండే నుంచే పంచుడు ప్రోగ్రాం స్టార్ట్ చేసారు అని అంటున్నారు. కొంతమంది అభ్యర్ధులు వాలంటీర్లతో సమావేశం జరిపి వారి ద్వారా ఎక్కడికక్కడ జాబితాలు తెప్పించుకుని ఓటుకు ఇంత అని వెల కట్టి మరీ బట్వాడా చేసే కార్యక్రమం చేస్తూంటే మరికొంతమంది అభ్యర్ధులు తామే సొంత టీం లను తయారు చేసుకుని వారి ద్వారా పంపిణీలు కడు జాగ్రత్తగా సాగేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు.

ఎంపీ అభ్యర్ధులకు ఎమ్మెల్యే అభ్యర్ధులకు ప్రధాన రాజకీయ పార్టీలు అనుసంధానం చేశాయి. దాంతో ఎన్నికల ఖర్చుకు ఎంపీల వద్దలు ఆయన అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు క్యూ కడుతున్నారు. ఇది కాకుండా అధినాయకత్వం కొంత మొత్తం అభ్యర్థులకు నేరుగా ముట్ట చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.

మరో వైపు చూస్తే అభ్యర్ధులు కూడా ఈ రెండింటి ద్వారా వచ్చే డబ్బుకు మ్యాచింగ్ గ్రాంట్ గా అభ్యర్థులు సొంత సొమ్ము తీసి ఖర్చు చేయాలని అధినాయకత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ప్రధాన పార్టీలు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీల తరఫున పరిశీలకులను నియమించారు. అలాగే కో ఆర్డినేటర్లు కూడా ఉన్నారు. జిల్లా స్థాయిలో బాధ్యులు ఉన్నారు.

వీరంతా కలసి ఒక ప్లాన్ ప్రకారం పంచుడు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా చెబుతున్నారు. ఓటుకు రెండు వేలు అన్నది కనీసంగా చెబుతున్న మాట. టఫ్ ఫైట్ ఉన్న చోట అది ఇంకా పెరుగుతోంది అని అంటున్నారు. అయితే కొన్ని చోట్ల పదిహేను వందల నుంచి కూడా మొదలెడుతున్నారు అని అంటున్నారు.

ఇక చూస్తే అధికార పార్టీకి వాలంటీర్ల ద్వారా ఆయా ప్రాంతాల లబ్దిదారుల వివరాలు అన్నీ పక్కాగా తెలుస్తున్నాయి కాబట్టి పంచుడుకు వీలు అవుతోంది అని అంటున్నారు. విపక్ష తెలుగుదేశం నుంచి చూస్తే ఆ పార్టీ బూత్ లెవెల్ కమిటీలు వేసింది. వారితో సమావేశాలు చేసి ఈ బట్వాడాను చేయించేందుకు సిద్ధపడుతున్నారని అంటున్నారు.

దీపావళికి బాణాసంచా సామగ్రి తెచ్చినట్లుగా పంచుడుకు కూడా అవసరం అయిన సరకూ సరంజామాలతో పార్టీలు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఎట్టి పరిస్థితులలో ప్రచారం ముగిసే నాటికల్లా పంచుడు కూడా పూర్తి కావాలని లక్ష్యంతో ప్రధాన పార్టీలు పనిచేస్తున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ పంచుడుకు ఈసీ డేగ కళ్లు ఎంతవరకూ నియంత్రిస్తాయో. ఏ పార్టీ ఎంత ఒడుపుగా అన్ని కళ్ళూ దాటుకుని తాము అనుకున్న తీరున పంచుడు మొదలెడుతుందో అన్నది.

Tags:    

Similar News