రూ‘బుల్ బుల్’.. అదృష్టం అంటే రష్యన్లదే..వెస్ట్రన్ శాపమే వరమైంది

2022 ఫిబ్రవరి 24.. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యకు దిగిన రోజు. అంతే.. అమెరికా పెద్దన్నగా వ్యవహరించే నాటో కూటమి రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2024-12-05 18:30 GMT

2022 ఫిబ్రవరి 24.. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యకు దిగిన రోజు. అంతే.. అమెరికా పెద్దన్నగా వ్యవహరించే నాటో కూటమి రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈ కూటమిలోని చాలా యూరప్ దేశాలకు రష్యా చమురు లేకుంటే పొయ్యి వెలగదు. కానీ, అమెరికా ప్రభావంతో రష్యాపై వాణిజ్య, ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యన్ బ్యాంకులను నిషేధించాయి. ఆ దేశ వ్యాపారులను వెలివేశాయి. మొత్తానికి రష్యాను ఆర్థికంగా ఏకాకి చేయాలని చూశాయి. అప్పుడే కాదు.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ (ఉక్రెయిన్ పై దాడికి దిగిన రెండేళ్ల తర్వాత) రష్యాపై అమెరికా, యూకే, ఈయూ కొత్త ఆంక్షలను ప్రకటించడం గమనార్హం. ఆ సమయంలో రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ మరణంతో ఈ ఆంక్షలను విధించాయి.

కొత్తగానే 500 ఆంక్షలు

ఇటీవల రష్యాపై 500 కొత్త ఆంక్షలను ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. ఆ దేశ యుద్ధ యంత్రాన్ని లక్ష్యంగా చేసుకుంటామని చెప్పారు. దాదాపు 100 సంస్థలు లేదా వ్యక్తులపై ఎగుమతి పరిమితులు విధించారు. మొత్తమ్మీద చూస్తే 2022 ఫిబ్రవరి నుంచి.. అంటే ఉక్రెయిన్‌ పై రష్యా దాడి నుంచి అమెరికా, యూకే, ఈయూ, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్‌ సహా పలు దేశాలు రష్యాపై 16,500 కంటే ఎక్కువ ఆంక్షలు విధించడం గమనార్హం.

మెక్ డొనాల్డ్స్ కూడా బంద్

ఉక్రెయిన్ మీద దాడికి దిగిన రష్యాను పాశ్చాత్య దేశాలు చాలా భయపెట్టాలని చూశాయి. ఎంతగానంటే మెక్ డొనాల్డ్స్ చైన్ రెస్టారెంట్లనూ మూసివేశాయి. దీంతో మళ్లీ తింటామో లేదోననే ఆందోళనతో రష్యను ఆ స్టోర్ల ముందు గుమిగూడారు. ఇక తమ దేశంపై ఆంక్షల ప్రభావం తమ భవిష్యత్ మీద పడుతుందనే భయంతో 10 లక్షల మంది రష్యన్ యువకులు ఆ దేశం వీడి వెళ్లారు.

సంక్షోభమే అవకాశమైంది..

సంక్షోభాలే అవకాశాలకు పునాదులు అంటారు పెద్దలు. ఇప్పుడు రష్యన్ల విషయంలో ఇదే నిజం అవుతోందట. పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలే వారికి బంగారు కొండగా మారాయట. బహుళ జాతి కంపెనీలు వెళ్లిపోయిన నాటి నుంచి వాటి స్థానంలో కొత్త రష్యన్ బ్రాండ్లు దుమ్మురేపుతున్నాయట. మార్కెట్ మొత్తాన్ని అవే కైవసం చేసుకున్నాయట. దీంతో లాభాల పంట పండుతోందని చెబుతున్నారు. ఆంక్షలు విధించడం ద్వారా.. రష్యా ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని చూసిన పశ్చిమ దేశాల ఆలోచనకు భిన్నంగా రష్యన్ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని పేర్కొంటున్నారు.

Tags:    

Similar News