'రైతు బంధు' డబ్బులు బాబు పసుపు కుంకమను గుర్తుకు తెస్తోందట

కేసీఆర్ ప్రభుత్వంపై సానుకూలత వ్యక్తమవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఇలాంటివి చెబుతున్న వారు 2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని మిస్ అవుతున్నారన్నది మర్చిపోకూడదు.

Update: 2023-11-26 05:19 GMT

రాజకీయాల్ని చూస్తున్నప్పుడు కొన్ని పడిగట్టు మాటలు.. రొడ్డు కొట్టుడు అంచనాలు వినిపిస్తూ ఉంటాయి. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళలోనూ ఇలాంటివే ఇప్పుడు కనిపిస్తున్నాయి. గత అనుభవాల్ని వదిలేసి.. అందరి మాదిరే ఆలోచించటం కనిపిస్తుంది. లాజిక్ వదిలేయటాన్ని కొందరు ఎత్తి చూపిస్తున్నారు. కారణం ఏమైనా కానీ.. నెల క్రితం తెలంగాణ రైతుల ఖాతాలో పడాల్సిన యాసంగి రైతు బంధు డబ్బులు కీలకమైన ఎన్నికల పోలింగ్ కు నాలుగైదు రోజుల ముందు పడుతుండటం తెలిసిందే.

రైతుబంధు డబ్బులు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓకే చెప్పిన వైనంపై అధికార బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తమవుతోంది. వాతావరణం తమకు అనుకూలంగా ఉన్నట్లుగా వారు వ్యాఖ్యానిస్తున్నారు. హరీశ్ లాంటి కీలక నేత సైతం.. దేవుడు తమవైపు ఉన్నాడని.. సోమవారం ఉదయానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతుల ఫోన్లు.. టింగు.. టింగు.. టింగు మంటూ మెసేజ్ ల మోత మోగుతుందని.. ఆ దెబ్బకు డబ్బులు వచ్చేస్తాయని చెబుతున్నారు.

కీలకమైన పోలింగ్ ముందు పడే రైతుబంధు డబ్బులు తెలంగాణ అధికారపక్షానికి అనుకూలంగా మారతాయని.. చూస్తూ.. చూస్తూ.. తమ ఖాతాల్లోకి డబ్బులు పడేందుకు కారణమైన కేసీఆర్ ప్రభుత్వంపై సానుకూలత వ్యక్తమవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఇలాంటివి చెబుతున్న వారు 2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని మిస్ అవుతున్నారన్నది మర్చిపోకూడదు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ఆడపడుచులకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పసుపుకుంకుమ పేరుతో డబ్బులు వేయటం.. ఒక్కో ఖాతాలో రూ.15వేల వరకు వేసిన వైనాన్ని మర్చిపోకూడదు. ఈ డబ్బుల లెక్కతో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ రావటం ఖాయమన్న మాటను తెలుగు తమ్ముళ్లు బలంగా చెప్పేవారు. కానీ.. ఎన్నికల ఫలితం ఎలా వచ్చిందో తెలిసిందే.

మొత్తంగా చూస్తే.. మార్పు రావాలన్న విషయంలో ప్రజలు ఒకసారి డిసైడ్ అయ్యాక.. రైతుబంధు మొదలు మరే ఇతర పథకమైనా.. దానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు ఎన్ని ఉన్నా.. అవి చూపే ప్రభావం స్వల్పంగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే.. రైతుబంధు డబ్బులు ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేస్తాయన్న మాటలో అర్థం లేదన్న వాదనను పలువురు వినిపిస్తున్నారు. మరేం జరుగుతుందో తేలాలంటే డిసెంబరు 3 వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ రోజే.. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యేదన్నది మర్చిపోకూడదు.

Tags:    

Similar News