మేనల్లుడ్ని రాజకీయాల్లోకి రమ్మంటే.. తేజ్ రియాక్షన్ ఇదే
అదో మరిచిపోలేని అనుభూతిగా అభివర్ణించిన సాయి ధరమ్ తేజ్
మేనమామను ప్రాణంగా ప్రేమించే మేనల్లుళ్లు చాలామందే కనిపిస్తారు. సినీనటులు.. సెలబ్రిటీల్లో అలాంటి అనుబంధాలు పెద్దగా బయటకు వచ్చింది లేదు. ఆ కొరతను తీరుస్తారు సాయిధరమ్ తేజ్. మామయ్య పవన్ అంటే ప్రాణంగా ప్రేమించేస్తుంటారు. ఈ విషయాన్ని తనకు అవకాశం వచ్చినప్పుడల్లా చెప్పేసే అతగాడు.. తాజాగా చెప్పిన మాట ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి కాంబినేషన్ లో నిర్మించిన 'బ్రో' ఈ నెల 28న విడుదల కానుంది.
రాజకీయాల్లో పవన్ బిజీగా ఉన్న వేళ.. ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతను తీసుకున్న సాయి ధరమ్ తేజ్.. ప్రముఖ దేవాలయాల్ని సందర్శిస్తున్నారు. ఆ మధ్యన పెద్ద రోడ్డు యాక్సిడెంట్ కు గురై.. చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన తేజ్ కు ఇది నిజంగానే పునర్జన్మగా చెప్పొచ్చు. అతగాడు సైతం ఇదే మాటను చెబుతుంటారు.
తాజాగా విజయవాడ కనకదుర్గమ్మ.. శ్రీకాళహస్తి ఈశ్వరాలయం.. కడప దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా తేజ్ కు ఘన స్వాగతం లభించటంతో పాటు.. అతడ్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇదే సందర్భంలో సాయిధరమ్ తేజ్ నోటి నుంచి వచ్చిన మాట ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. తనకు కడప దర్గాకు రావటం ఒక అలవాటని చెప్పుకొచ్చారు. బ్రో మూవీ గురించి చెబుతూ.. మామయ్యతో కలిసి నటించటం లక్ గా భావిస్తున్నట్లు చెప్పారు.
అదో మరిచిపోలేని అనుభూతిగా అభివర్ణించిన సాయి ధరమ్ తేజ్.. 'మామయ్య ఇప్పుడు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. రాజకీయాలపై అవగాహన ఉంటే నన్ను కూడా రాజకీయాల్లోకి రమ్మన్నారు. కానీ.. నేను సినీ రంగంలో ఉంటానని చెప్పా. పవన్ మామయ్య అంటే నాకు ప్రాణం' అని చెప్పుకొచ్చారు.
మొత్తంగా పాలిటిక్స్ మీద ఇంట్రస్టు ఉంటే రమ్మన్న పవన్ కు.. మేనల్లుడు తేజ్ నో అన్న మాటను చెప్పిన విషయాన్ని అతగాడే స్వయంగా చెప్పటం గమనార్హం. తేజ్ నోటి నుంచి వచ్చిన ఈ మాట పవన్ అభిమానులు ఏ రీతిలో తీసుకుంటారో చూడాలి.